ఇదేం బాబోతం
స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్ట్ టెండర్ల రద్దు
యువగళం నేతలకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు
త్వరలో కొత్తగా టెండర్ల ఆహ్వానానికి పావులు
మిగిలిన జిల్లాల్లో ఇప్పటికే ఖరారు
‘తూర్పు’లో నెల రోజులుగా కాలయాపన
సాక్షి, రాజమహేంద్రవరం: తెరచాటు బాగోతం నడుపుతున్నారు.. విద్యుత్ శాఖలో స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్ట్‌ను యువగళం సభ్యులకు కట్టబెట్టేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. దీనికిగాను ఖరారు చేయాల్సిన టెండర్లను సైతం అనూహ్యంగా రద్దు చేసేశారు. తిరిగి టెండర్లు పిలిచి చినబాబు అనుచరులకు కాంట్రాక్ట్ దక్కేలా పావులు కదుపుతున్నారు.
విద్యుత్ పంపిణీ సంస్థలు కాంట్రాక్టు పద్ధతిలో స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టులు ఇస్తుంటాయి. గ్రామీణ, పట్టణ, ఏజెన్సీ కేటగిరీల వారీగా తీసిన బిల్లులకు కాంట్రాక్టర్‌కు కమీషన్ ఇస్తాయి. ఇందులో భాగంగానే 2023–25లో నిర్ణయించిన ధరలతోనే ఈ ఏడాది సైతం టెండర్లు పిలిచారు. రాజమహేంద్రవరం సర్కిల్‌కు సంబంధించి గత నెల 12న ఆన్‌లైన్ టెండర్లు ఆహ్వానించారు. అదే నెల 26న షెడ్యూల్ క్లోజ్, బిడ్ సబ్మిట్, హార్ట్ కాపీస్ తదితర ప్రక్రియకు చివరి తేదీగా ప్రకటించారు. గత నెల 26వ తేదీనే బిడ్ ఓపెన్ చేసి టెండర్ ఎవరికి దక్కిందో ప్రకటించాల్సి ఉంది. రాజమహేంద్రవరం సర్కిల్ కార్యాలయంలో మాత్రం నేటికీ ఆ ప్రక్రియ జరగలేదు. బిడ్ ఓపెన్ చేయాల్సిన సమయం ముగిసి సుమారు నెల రోజులవుతున్నా.. టెండర్ల ప్రస్తావనే లేదు. ఒక్కసారిగా టెండర్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించడంతో కాంట్రాక్టర్లు అవాక్కవుతున్నారు. తాము అనుకున్న విధంగా టెండర్లు దాఖలు చేయలేదనే కారణంతో టెండర్లు రద్దు చేసినట్లు ఏపీఈపీడీసీఎల్ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే దీని వెనుక మతలబు దాగుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యువగళం నేతలకు టెండర్ కట్టబెట్టేందుకు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నట్లు ఆరోపణలున్నాయి.
నిబంధనలకు తిలోదకాలు
స్పాట్ బిల్లింగ్ ప్రక్రియకు గత నెలలో జరిగిన టెండర్లలో నిబంధనలకు తిలోదకాలిచ్చారు. టెండర్‌లో పాల్గొనే కాంట్రాక్టర్‌కు క్లాస్–1 రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే టెండర్ దాఖలుకు అర్హత ఉంటుంది. సర్టిఫికెట్ లేకపోతే టెండర్ నుంచి డిస్‌క్వాలిఫై చేయాలి. టెండర్లు దాఖలు చేసిన గుంటూరు, విజయవాడ, ఒంగోలుకు చెందిన యువగళం సభ్యులకు అవేమీ లేవు. మంత్రి లోకేష్ అండదండలు మాత్రం పుష్కలంగా ఉండటంతో టెండర్లు దాఖలు చేసేశారు. తర్వాతైనా అధికారులు పరిశీలించి డిస్‌క్వాలిఫై చేయాల్సి ఉన్నా.. కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. భీమవరంలో ఇలాంటి పరిస్థితి తలెత్తితే అక్కడి ఎస్‌ఈ వెంటనే డిస్‌క్వాలిఫ్ చేశారు. రాజమహేంద్రవరం సర్కిల్‌లో మాత్రం మిన్నకుండిపోవడం వెనుక ఆంతర్యం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది.
క్లాస్–1 కాంట్రాక్టర్లుగా అవతారం
టెండర్ల దాఖలులో యువగళం సభ్యులకు అర్హతలు లేవు. అయినా వారికే టెండర్లు దక్కేలా చేసేందుకు అధికారులు నడుపుతున్న వ్యవహారం ఆ శాఖలోనే చర్చనీయాంశం అయ్యింది. క్లాస్–1 కాంట్రాక్టర్ సర్టిఫికెట్ ఎలాగైనా సంపాదించాలని, అప్పటి వరకూ టెండర్ల ప్రక్రియ పెండింగ్‌లో పెడతామని అధికారులు అభయం ఇచ్చినట్లు తెలిసింది. ఇదే అదునుగా భావించిన ముగ్గురు యువగళం సభ్యులు ఈ నెల 7, 8వ తేదీల్లో క్లాస్–1 కాంట్రాక్టర్లుగా రిజిస్టర్ అయ్యారు. ఇంకే ముంది టెండర్‌లో పాల్గొనేందుకు అర్హత దక్కించుకున్నారు. స్వామిభక్తి ప్రదర్శించిన విద్యుత్ అధికారులు పాత టెండర్లను రద్దు చేశారు. తిరిగి కొత్త టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కొత్తగా ఆహ్వానించే టెండర్లలో యువగళం సభ్యులు పాల్గొనే అవకాశం ఉంది. వీటిలో సైతం ముగ్గురూ రింగయ్యేలా ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలిసింది. టెండర్‌ను సైతం వారిలో ఎవరికో ఒకరికి కేటాయించేలా తెర వెనుక కథ నడుస్తోందన్న విమర్శలున్నాయి. ముగ్గురు ఇప్పటికే రింగైనట్లు సమాచారం. అధికారుల సూచనలతో తక్కువ ధరకు టెండర్లు వేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. ఆ ముగ్గురికే ఇవ్వాలని చినబాబు పేషీ నుంచి విద్యుత్ అధికారులపై తీవ్రమైన ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. మిగిలిన జిల్లాల్లో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, టెండర్ దక్కించుకున్న వారికి కాంట్రాక్ట్ అప్పగించారు.
స్పాట్ బిల్లింగ్ చేస్తున్న సిబ్బంది (ఫైల్)
అన్ని శాఖల్లో వాలిపోయి..
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న నేతలు, సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో వాలిపోతున్నారు. గుంటూరు, ఒంగోలు, విజయవాడకు చెందిన వారు ఏ శాఖలో కాంట్రాక్ట్ అయినా తామే దక్కించుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇది వరకూ ఆర్టీఓ అధికారుల నేతృత్వంలో జరిగే వెహికల్ ఫిట్నెస్ టెస్ట్ (వాహన సామర్థ్య పరీక్షలు) సెంటర్లు సైతం కై వసం చేసుకున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ జిల్లాలో ఇదే తంతు జరుగుతుంది. ప్రైవేట్ సభ్యుల ఆధ్వర్యంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తే.. వాహనాల భద్రత ఎలాగన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. ఇది చాలదన్నట్లు తాజాగా విద్యుత్ శాఖపై కన్నేశారు. స్పాట్ బిల్లింగ్ టెండర్లు దక్కించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.
టెండర్ల రద్దు వాస్తవమే
స్పాట్ బిల్లింగ్ టెండర్లు రద్దు చేసిన విషయం వాస్తవమే. టెండర్ల దాఖలులో ఆశించిన మేర ఎక్కువ మంది టెండర్లు వేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. తిరిగి టెండర్లు ఆహ్వానిస్తాం. ఆన్‌లైన్ విధానంలో ఎవరైనా టెండర్లు వేసుకోవచ్చు. టెండర్ కేటాయింపులో నిబంధనల మేరకే వ్యవహరిస్తాం.
– తిలక్‌కుమార్, ఎస్‌ఈ, ఏపీఈపీడీసీఎల్,
రాజమహేంద్రవరం సర్కిల్
జిల్లాలో విద్యుత్ కనెక్షన్లు
విద్యుత్ డివిజన్ కేటగిరీ–1 కేటగిరీ–2
నిడదవోలు 2,25,071 23,735
రాజమహేంద్రవరం రూరల్ 1,98,390 20,528
రాజమండ్రి అర్బన్ 2,12,425 32,761
ఇదేం బాబోతం


