అవుట్ ఫాల్ స్లూయిజ్‌లు తెరచి ఉంచాలి
● ఎంపీడీవోలతో జెడ్పీ చైర్మన్ విప్పర్తి
టెలి కాన్ఫరెన్స్
సాక్షి, అమలాపురం: ‘గోదావరి నదీలో వరద సాధారణ స్థితికి వచ్చింది. ఇన్‌ఫ్లో గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు వరద వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇరిగేషన్ అధికారులు నదులకు అనుబంధంగా ఉన్న అవుట్ ఫాల్ స్లూయిజ్‌లను తెరచి ఉంచాలి. భారీ వర్షాలు కురిస్తే చేల నుంచి డ్రెయిన్లు, అక్కడ నుంచి అవుట్ ఫాల్ స్లూయిజ్ ద్వారా నదీ పాయలలోకి ముంపు నీరు దిగిపోతుంది’ అని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ రిటైర్డ్ ఎస్‌ఈ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. ఈ విషయంపై ఆయన ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. మోంథా తుపాను నేపథ్యంలో సోమవారం ఆయన ఎంపీడీవోలు, జెడ్పీ సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకుముందు ఆయన ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో తూర్పు, మధ్య డెల్టా పరిధిలో పలు డ్రెయిన్ల నుంచి ముంపునీరు నదీపాయాల్లో కలుస్తుందని, ఇప్పుడు వరద లేనందున వాటిని తెరచి ఉంచాలని సూచించారు. రెండు డెల్టాల పరిధిలో వరి కోతలకు సిద్ధమవుతున్నందున ముంపుబారిన పడి ఎక్కువ రోజులు ఉంటే దెబ్బతినే అవకాశముందని, సాధ్యమైనంత త్వరగా ముంపునీరు బయటకు వెళ్లే చర్యలు చేపట్టాలన్నారు. కోనసీమ జిల్లా పరిధిలోని ఎంపీడీవోలు, జెడ్పీ అనుబంధ విభాగాలకు చెందిన సిబ్బందితో ఆయన మాట్లాడుతూ మోంథా తుపాను ఎదుర్కొనేందుకు ఎంపీడీవోలు, జెడ్పీ సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. పునరావాస కేంద్రాలలో బాధితులకు ఆహారంతోపాటు చిన్న పిల్లలకు పాలు అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంత మండలాలకు చెందిన ఎంపీడీవోలు చురుగ్గా ఉండాలని, అక్కడే తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు సూచించారు.


