రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి
అమలాపురం: మోంథా తుపాను వల్ల వరి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జున్నూరి రామారావు (బాబీ) అన్నారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం కోడూరుపాడు వద్ద దేశికోడు డ్రైయిన్‌ను రైతు విభాగ సభ్యులతో కలసి తుపాను నేపథ్యంలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో గోదావరి డెల్టాలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. గోదావరి సెంట్రల్ డెల్టా పరిధిలోని ప్రధాన డ్రెయిన్‌లో తూడు, చెత్త, చెదారం భారీ స్థాయిలో పేరుకుపోయాయని తెలిపారు. ప్రధాన డ్రెయిన్‌లో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయిందని, ముంపు నీరు స్తంభించిపోయినా ప్రభుత్వం, డ్రెయిన్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం కోనసీమ జిల్లావ్యాప్తంగా వరి చేలు ఈనిక, పూత దశలో ఉన్నాయని, భారీ వర్షాలకు ముంపు నీరు స్తంభిస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు.
సెంట్రల్ డెల్టా పరిధిలోని ప్రధాన డ్రెయిన్‌లో నిబంధనలకు విరుద్ధంగా మత్స్యకారులు వెదురు బొంగులతో వందలాది వలకట్లు ఏర్పాటు చేసి, ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారని బాబీ తెలిపారు. అల్లవరం మండలంలో లోయర్ కౌశిక, దేశికోడు, వాసాలతిప్ప, కూనవరం స్ట్రెయిట్ కట్‌లో పదుల సంఖ్యలో వలకట్లు ప్రవాహాన్ని అడ్డుకుని ముంపు నీటిని స్తంభింపజేస్తున్నాయని తెలిపారు. ఖరీఫ్‌లో వలకట్లను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. వలకట్లు తొలగిస్తే ముంపు తీవ్రత కొంత మేర తగ్గుతుందన్నారు. డ్రెయిన్ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వలకట్లు తొలగించాలని డిమాండ్ చేశారు. వాసాలతిప్ప డ్రెయిన్ లో లెవెల్‌లో ఉండగా, ఎన్.రామేశ్వరం మొగ రెండడుగుల మేర మెరకగా ఉందని, దీనివల్ల ముంపు నీరు స్తంభించిపోతోందని తెలిపారు. ఎన్.రామేశ్వరం బ్రిడ్జి నుంచి మొగ వద్ద సుమారు రెండు కిలోమీటర్ల పొడవున పర్ర భూమిలో డ్రెడ్జింగ్ చేసి, పూడిక తొలగించాల్సి ఉందన్నారు.
సెంట్రల్ డెల్టా డ్రెయిన్‌లో తూడు తొలగింపు పనుల నిర్వహణకు ప్రాజెక్టు చైర్మన్ గుబ్బల శ్రీనివాసరావుకు రూ.2 కోట్లు ఇచ్చారని, ఆయన రోజుకు కేవలం పది మందితో తూడు తొలగింపు పనులు చేపడితే ఎప్పటికి పూర్తి చేస్తారని బాబీ ప్రశ్నించారు. ఒక్కరికే కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించడం ద్వారా నిధులు స్వాహా చేసేందుకు ప్రణాళిక వేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. తుపాను నేపథ్యంలో ఇప్పుడు పనులు ప్రారంభిస్తే ఎప్పటికి పూర్తి చేస్తారో డ్రెయిన్ అధికారులే సమాధానం చెప్పాలన్నారు. తూడు తొలగింపు పనులను డ్రెయిన్ల వారీగా విభజించి, శరవేగంగా పూర్తి చేస్తే ముంపు సమస్యను కొంత మేర పరిష్కరించవచ్చని సూచించారు.
డ్రైనేజీ సమస్యపై బాబీ కలెక్టర్ మహేష్ కుమార్‌ను అమలాపురంలో మంగళవారం కలిసి మాట్లాడారు. వలకట్లు తక్షణమే తొలగించాలని, ఖరీఫ్‌లో వీటిని పూర్తిగా నిషేధించాలని కోరారు. ప్రాజెక్టు కంపెనీ చైర్మన్‌కు అప్పగించిన తూడు తొలగింపు పనులను డ్రెయిన్ల వారీగా విభజించి, చేపడితే పంటలు కాపాడుకోవచ్చని, తద్వారా రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని బాబీ కోరారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కాండ్రేగుల జవహర్, ఇందుకూరి సత్యనారాయణరాజు, రైతు నాయకులు పాల్గొన్నారు.
ఫ ప్రధాన డ్రైన్‌లో నిబంధనలకు
విరుద్ధంగా వలకట్లు
ఫ శరవేగంగా తూడు తొలగింపు
పనులు చేపట్టాలి
ఫ వైఎస్సార్ సీపీ రైతు విభాగం
అధ్యక్షుడి డిమాండ్


