అప్రమత్తంగా ఉండాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): మోంథా తుపాను నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. తుపాను ప్రభావం దృష్ట్యా కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన అత్యవసర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విపత్తు ముందు, తర్వాత అధికారులు పూర్తి స్థాయి సన్నద్ధతతో ఉండాలని సూచించారు. రోడ్లు గండ్లు పడటం, చెట్లు కూలడం, ముంపు ప్రాంతాల వంటి సమస్యలను ముందుగానే గుర్తించి, చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక యువత, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. విపత్తులను ఎదుర్కోవడంపై యువతకు శిక్షణ ఇచ్చి గ్రామాల వారీగా బృందాలను సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా తుపాను ప్రత్యేక అధికారి కె.కన్నబాబు మాట్లాడుతూ, ఎర్ర కాలువ, కొవ్వాడ కాలువ, బురద కాలువల్లో ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైతే రిజర్వాయర్ల నుంచి నియంత్రణ విధానంలో నీటిని విడుదల చేయాలని సూచించారు. రహదారులపై గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, ఏ సమయంలోనైనా తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున శాఖల వారీగా చర్యలు అమలు చేయాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ మాట్లాడుతూ, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు పహారా కట్టుదిట్టం చేశామన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, పోలీస్ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్‌డీఓలు రాణి సుస్మిత, కృష్ణనాయక్, డీఆర్‌ఓ టి.సీతారామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.భాస్కర్‌రెడ్డి, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా ఉన్నతాధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి పాల్గొన్నారు.


