తుపానును ఎదుర్కొనేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సిద్ధం | - | Sakshi
Sakshi News home page

తుపానును ఎదుర్కొనేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సిద్ధం

Oct 29 2025 7:57 AM | Updated on Oct 29 2025 7:59 AM

రాజమహేంద్రవరం సిటీ: తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా సేవలందించేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ పలివెల రాజు మంగళవారం తెలిపారు. అవసరమైన చోట్ల మొబైల్‌ జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏడు డివిజన్లలో ఏడు టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తుపాను సమయంలో నెట్‌వర్క్‌ ఇబ్బందులు తెలియజేసేందుకు 0883–2472200 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

విద్యా సంస్థలకు

నేడు కూడా సెలవు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని విద్యా సంస్ధలకు బుధవారం కూడా సెలవు ప్రకటిస్తూ కలెక్టర్‌ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు మంగళవారం ఈ విషయం తెలిపారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఎవరైనా స్టడీ క్లాసులు, అదనపు తరగతుల పేరుతో పాఠశాల నిర్వహిస్తే సంబంధిత యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పునరావాస కేంద్రాల్లో

సౌకర్యాలు కల్పించాలి

జెడ్పీ చైర్మన్‌ వేణుగోపాలరావు

కొత్తపేట: మోంథా పెను తుపాను నేపథ్యంలో పునరావాస కేంద్రాలకు తీసుకువచ్చిన నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు అధికారులు, సిబ్బందికి సూచించారు. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక మండల ప్రజాపరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని, పలు గ్రామాలను మంగళవారం జెడ్పీ చైర్మన్‌ సందర్శించారు. అక్కడ ఉన్నవారి వివరాలు, వసతి సౌకర్యాలు, కేంద్రంలో వారికి అందిస్తున్న సేవల గురించి సెంటర్‌ పర్యవేక్షణ అధికారులు, సిబ్బందిని ఆరా తీశారు. వారికి పాలు, ఆహారం, అవసరమైన వైద్యం అందించాలని విప్పర్తి సూచించారు. తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలులు, భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలను అప్రమత్తం చేయాలని సర్పంచ్‌, సచివాలయం, ఆరోగ్య కేంద్రం సిబ్బందికి సూచించారు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండవద్దని, ముఖ్యంగా చెట్లు, విద్యుత్‌ లైన్ల కింద, శిథిలావస్థకు చేరిన ఇళ్లు, షెడ్లు, పూరిపాకల్లో ఉండవద్దని హెచ్చరించారు. విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. లైన్లపై చెట్ల కొమ్మలు పడి, వైర్లు తెగినా ప్రమాదం జరగకముందే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు తీసుకునేలా సిద్ధంగా ఉండాలని వేణుగోపాలరావు సూచించారు.

ఏలేరుకు వరద నీరు

ఏలేశ్వరం: మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఏలేరు రిజర్వాయర్‌కు వరద నీరు పోటెత్తుతోంది. పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో 5,175 క్యూసెక్కుల మేర నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, మంగళవారం 85.39 మీటర్లకు చేరింది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వలు 21.74 టీఎంసీల మేర ఉన్నాయి. దిగువ ప్రాంతానికి 5 వేలు, విశాఖకు 175 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్నందున నీటి నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

తుపానును ఎదుర్కొనేందుకు  బీఎస్‌ఎన్‌ఎల్‌ సిద్ధం 1
1/2

తుపానును ఎదుర్కొనేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సిద్ధం

తుపానును ఎదుర్కొనేందుకు  బీఎస్‌ఎన్‌ఎల్‌ సిద్ధం 2
2/2

తుపానును ఎదుర్కొనేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement