ఉద్యాన పంటల రక్షణకు చర్యలు తీసుకోండి
పెరవలి/ దేవరపల్లి: మోంథా తుపానుతో తీవ్ర నష్టం సంభవించే అవకాశం ఉన్నందున ఉద్యాన పంటలను రక్షించుకోవటానికి రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఉద్యాన అధికారి ఎన్.మల్లికార్జునరావు తెలిపారు. జిల్లాలోని దేవరపల్లి, కొవ్వూరు, పెరవలి, నిడదవోలు మండలాల్లో సోమవారం ఆయన పర్యటించి రైతులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు మాట్లాడుతూ జిల్లాలో 1.62 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉండగా, తుపాను కారణంగా బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంటలను రక్షించుకోవాలని సూచించారు. అరటి, బొప్పాయి, కూరగాయలు, పూల తోటల సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. తోటల్లో నిల్వ నీటిని వెంటనే బయటకు పంపించి, చెట్లకు ఊతం (వెదురు) ఇవ్వాలని ఆయన సూచించారు. వర్షం ఆగిన వెంటనే యూరియా, పొటాషియం, వంటి ఎరువులను వేయడం, సస్యరక్షణ మందులు పిచికారీ చేయడం, గాలి ప్రసరణకు తగిన ఏర్పాట్లు చేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని ఆయన తెలిపారు. రైతులకు వాట్సాప్ గ్రూపుల ద్వారా హెచ్చరికలు, సూచనలు పంపించడమే కాకుండా మండల, గ్రామ స్థాయిలో సహాయక వ్యవస్థలు ఏర్పాటు చేశామన్నారు. తోటల్లో పక్వానికి వచ్చిన పండ్లు, కూరగాయలను యుద్ధప్రాతిపదికన మార్కెట్లకు తరలించాలని, లేనిపక్షంలో నష్టాలు చవిచూడాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


