మొత్తమోంథా ముంచేసి..
● తుపాను ప్రభావంతో
జిల్లా వ్యాప్తంగా వర్షాలు
● అప్రమత్తమైన అధికారులు
● సహాయక చర్యలకు కంట్రోల్
రూముల ఏర్పాటు
● నేడు కూడా ప్రభుత్వ,
ప్రైవేటు పాఠశాలలకు సెలవు
సాక్షి, రాజమహేంద్రవరం: ‘మోంథా’ ముంచుకొస్తోంది.. తుపాను తీరానికి దగ్గరవుతున్న కొద్దీ ప్రభావం మరింత పెరుగుతోంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడ సమీపంలో రాత్రికి తీరం దాటనున్నట్లు అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వర కూ ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. కూలి పనులు, వివిధ వ్యాపారాల నిమి త్తం వెళ్లే ప్రజలకు అవస్థలు తప్పలేదు. ఉదయం నుంచే వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. ఆకాశం మేఘావృతమైంది. చలి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే మోంథా తుపాను నేపథ్యంలో అధికారులు అ ప్రమత్తమయ్యారు. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిల్చోరాదని, విద్యుత్ ఉపకరణాలను డిస్‌కనెక్ట్ చేసి భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రజలను కోరారు. రైతులు ఉరుములు, మెరుపులు ఉ న్న సమయంలో పొలాలకు వెళ్లకూరాదన్నారు. వ్యవసాయ పరికరాలను భద్రపరచుకోవాలని కలెక్టర్ సూ చించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. అన్ని శాఖాధికారులు, క్షేత్ర సిబ్బంది అప్రమత్తంగా ఉండి తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే కంట్రోల్ రూమ్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను ప్రభావం దృష్ట్యా జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు.
ప్రత్యేకాధికారి పర్యటన
మోంథా తుపాను చర్యలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేక అధికారిగా కన్నబాబును నియమించింది. ఆయన సోమవారం నిడదవోలు మండలంలో పర్యటించారు. అక్కడి అధికారులతో చర్చించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నిడదవోలు మండలం కంసాలిపాలెంలోని ఎర్ర కాలువ పరిస్థితి పరిశీలించారు. ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం కేవలం 2 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహిస్తోందని, ఇది ప్రమాదకర స్థాయి కాదని ఆయన స్పష్టం చేశారు. ఎర్రకాలువ ఉప్పొంగే పరిస్థితి లేదని, నిడదవోలు పట్టణం సురక్షితమని వివరించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, లోతట్టు ప్రాంతాల్లో తగిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
నీటి మునగడంతో నష్టం
మోంథా తుపాను నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి పంట పాలుపోసుకునే, గింజ గట్టిపడే దశలో ఉంది. ఇలాంటి తరుణంలో తుపాను హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వరి పంట కోతలు చేపట్టగా, వర్షాలతో ఇబ్బందిగా మారింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 52,929 హెక్టార్లలో పంట ప్రభావితమైంది. 356 హెక్టార్లలో పంట నీట మునగగా.. 384 హెక్టార్లలో దెబ్బతింది. 12 మండలాల్లో 105 గ్రామాల్లో వర్ష ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయి. 5,207 మంది రైతులు నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక నివేదిక రూపొందించారు. తుపాన్ ప్రభావంతో కురిసే భారీ వర్షాలకు మరింత వరి పంట నేలకొరిగి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉద్యాన రైతుల్లో ఉలికిపాటు
జిల్లాలో సుమారు 1.62 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. తుపాను కారణంగా బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఉద్యాన రైతులు ఉలికిపాటుకు గురవుతున్నారు. అరటి, బొప్పాయి, కూరగాయలు, పూల పంటలు దెబ్బతినే అవకాశం ఉండటంతో రైతులు ముందుగా సంరక్షణ చర్యలు తీసుకోవాలని, తోటల్లో నిల్వ నీటిని వెంటనే బయటకు పంపించి, చెట్లకు ఊతం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
బ్రాహ్మణగూడెంలో నిడదవోలు –
పంగిడి రహదారిపై నిలిచిన వర్షపునీరు
కంట్రోల్ రూముల ఏర్పాటు
తుపాను నేపథ్యంలో జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి 24 గంటల పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే సంబంధిత కంట్రోల్ రూములకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
తూర్పుగోదావరి జిల్లా కంట్రోల్ రూమ్ :
0883–2944455
రాజమహేంద్రవరం డివిజన్ :
ఆర్డీఓ కార్యాలయం, రాజమహేంద్రవరం:
0883–2442344
రాజమహేంద్రవరం అర్బన్:
0883–2940695
రాజమహేంద్రవరం రూరల్: 98499 03860
కడియం: 63015 23482
రాజానగరం : 94945 46001
రంగంపేట : 93939 31667
కోరుకొండ : 91544 74851
అనపర్తి : 94413 86920
బిక్కవోలు : 98499 03913
సీతానగరం : 91770 96888
గోకవరం : 94913 85060
కొవ్వూరు డివిజన్ :
ఆర్డీఓ కార్యాలయం, కొవ్వూరు: 79953 67797
కొవ్వూరు: 98667 78416
చాగల్లు: 94412 93856
తాళ్లపూడి: 79936 36666
పెరవలి: 08819–232179
ఉండ్రాజవరం: 94910 41474
నల్లజర్ల: 94910 41451
దేవరపల్లి: 97058 18045
గోపాలపురం: 75698 56778
నిడదవోలు: 94405 80856


