వైద్య విద్యను దూరం చేసే కుట్ర | - | Sakshi
Sakshi News home page

వైద్య విద్యను దూరం చేసే కుట్ర

Oct 19 2025 6:43 AM | Updated on Oct 19 2025 6:43 AM

వైద్య విద్యను దూరం చేసే కుట్ర

వైద్య విద్యను దూరం చేసే కుట్ర

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): బహుజనులకు వైద్య విద్యను దూరంగా చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, అందుకే మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తుందని జై భీమ్‌ రావ్‌ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్‌ కుమార్‌ మండిపడ్డారు. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణపై కాకినాడ అంబేడ్కర్‌ భవన్‌లో శనివారం మేధోమథన సదస్సు నిర్వహించారు. తొలుత కాకినాడ ఇంద్రపాలెం సెంటర్‌ వద్ద ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, కలెక్టరేట్‌ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జై భీమ్‌రావ్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, న్యాయవాది జగ్గారపు మల్లికార్జున అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా శ్రావణ్‌కుమార్‌ హాజరు కాగా, విశిష్ట అతిథులుగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ వంగా గీత హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ, ఓ హాస్పిటల్‌ నిర్మించాలంటే రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు అవసరం అవుతుందన్నారు. కేవలం బినామీలకు దోచిపెట్టడానికే పీపీపీ విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేష్‌ ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తే పేద, మధ్య తరగతి విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం పూర్తిగా లేకుండా పోతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్‌ కాలేజీలను తీసుకొచ్చి రూ.5,600 కోట్లను బడ్జెట్‌లో కేటాయిస్తే, మిగిలిన రూ.3 వేల కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించలేక ప్రైవేటీకరణ చేస్తుందని విమర్శించారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున బడ్జెట్‌లో కేటాయిస్తే, మూడేళ్లలో 17 మెడికల్‌ కాలేజీలు పూర్తి చేయవచ్చనే అవగాహన లేకుండా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పాలన సాగించడం సిగ్గుచేటన్నారు. నిరుపేదల విద్యార్థుల డాక్టర్‌ అయ్యే కలను కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తుందని మండిపడ్డారు. 33 ఏళ్ల లీజుకు ఇచ్చే పీపీపీ విధానం వల్ల రూ.వేలాది కోట్ల ధనార్జన చేస్తారన్నారు. పీపీపీ విధానంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ బినామీలు మాత్రమే ఉన్నారని ఆరోపించారు. పిఠాపురం ప్రజలు బాధపడుతున్నారని, దేశం మొత్తం పిఠాపురం వైపు చూస్తుందన్న పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ఇప్పుడు పిఠాపురం ప్రజల ఆలోచన మరోలా ఉందని ఎద్దేవా చేశారు. రియల్‌ స్టార్‌కి, రీల్‌ స్టార్‌కి చాలా తేడా ఉందని పవన్‌ కల్యాణ్‌ గుర్తించాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి ఫొటో ఎందుకు ఉండాలో చెప్పాలని, దీనిపై న్యాయస్థానంలో రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా జై భీమ్‌ రావ్‌ భారత పార్టీ నుంచి ఎనిమిది లక్షల సంతకాల సేకరణ చేపడతామని హామీ ఇచ్చారు.

ప్రజలపై బాధ్యతా రాహిత్యం

కూటమి ప్రభుత్వం ప్రజలపై బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. పేద, మధ్యతరగతి వర్గాలు బాగుండాలని కోరుకునే మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.ఎనిమిది వేల కోట్లతో మెడికల్‌ కాలేజీలు నిర్మించాలని భావిస్తే, వాటిని ప్రైవేటీకరణ చేయాలన్న దురాలోచనలతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఒకరోజు హాస్పిటల్‌లో ఉండాలంటే రూ.20 వేల నుంచి రూ.25 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నేడు ఉందన్నారు. గత 15 రోజులుగా డాక్టర్లు సమ్మె చేస్తుంటే కనీసం వారిని పిలిచి మాట్లాడలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ఆగిపోతున్న గుండెలను తిరిగి కొట్టుకునేలా చేసిన మహానేత దివంగత వైఎస్సార్‌ సేవలు, గత ప్రభుత్వంలో కరోనా సమయంలో చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సేవలను రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 72 రకాల మందులను, 14 రకాల ఉచిత టెస్టులను చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని విమర్శించారు. పార్వతీపురం కేంద్రంలో 230 మంది చిన్నారులు అస్వస్థతకు గురై కామెర్లు వస్తే 120 మంది చిన్నారులను కేజీహెచ్‌లో చేర్పించే స్థాయికి కూటమి ప్రభుత్వం ఉందన్నారు. తాగునీటిలో మలమూత్రాలు ఉన్నాయని రిపోర్టు వచ్చిందన్న విషయాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు బయట పెట్టకపోవడం సిగ్గుచేట్టన్నారు.

జై భీమ్‌ రావ్‌ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌

కూటమి ప్రభుత్వ పీపీపీ విధానంపై

నేతల మండిపాటు

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై

మేధోమథన సదస్సు

ప్రజలు పోరాడాలి

మాజీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయంపై రాష్ట్ర ప్రజలందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిత్వ వికాసానికి, సమాజ వికాసానికి విద్య నిజమైన ఆయుధం లాంటిదని, అటువంటి విద్యను పేద విద్యార్థులకు దూరం చేసే పని కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్‌ రావ్‌ భారత్‌ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి ఏనుగుపల్లి కృష్ణ, న్యాయవాదులు దాడిశెట్టి వీరబాబు, గుగ్గిలపు హరీష్‌, వైఎస్సార్‌ సీపీ నాయకులు రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, రాగిరెడ్డి బన్నీ, సుంకర విద్యాసాగర్‌, వర్ధినీడి సుజాత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement