
ఆనంద దీపావళి చేసుకోండి
– జిల్లా కలెక్టర్ కీర్తి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కుటుంబ సమేతంగా జిల్లా ప్రజలు ఆనందంగా, సురక్షితంగా దీపావళి పండగను జరుపుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. జిల్లా ప్రజలకు శనివారం ఓ ప్రకటనలో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని, వెలుగుల పండగ అందరికీ సుఖశాంతులను తీసుకురావాలని ఆకాంక్షించారు. వాతావరణ కాలుష్యం, శబ్ధ కాలుష్యం తక్కువగా ఉండే టపాసులు కాల్చి, నూనె దీపాలు వెలిగించి పండగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సూచించారు. అగ్నిమాపక శాఖ సూచించిన నిబంధనలను పాటించి, జాగ్రత్తలు తీసుకుంటూ పండగ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పీజీఆర్‌ఎస్ లేదు
దీపావళి పండగ సందర్భంగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సెలవు రోజు కావడంతో జిల్లా, డివిజన్, మండల, సచివాలయ స్థాయిలో పీజీఆర్‌ఎస్‌ను నిర్వహించడం లేదని కలెక్టర్ తెలిపారు. ప్రజలు వారి సమస్యలను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలియజేయవచ్చన్నారు.
పంచారామ క్షేత్రాలకు
ప్రత్యేక బస్సులు
రాజమహేంద్రవరం సిటీ: ఒకే రోజు పంచారామ పుణ్య క్షేత్రాలను (కార్తిక సోమవారాలు) దర్శించే ప్యాకేజీతో రాజమహేంద్రవరం డిపో నుంచి బస్సులు నడపనున్నట్టు డిపో మేనేజర్ మాధవ్ శనివారం తెలిపారు. కార్తిక మాసం సందర్భంగా ప్రతి ఆదివారం రాత్రి రాజమహేంద్రవరం డిపో నుంచి ఉదయం ఏడు గంటలకు పంచారామ స్పెషల్ బస్సులు బయలుదేరుతాయన్నారు. సోమవారం అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట క్షేత్రాలను దర్శించుకుని, అదే రోజు రాత్రి పది గంటలకు డిపోకు చేరుతాయన్నారు. రాజమహేంద్రవరం నుంచి ఈ నెల 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో వెళ్లే సూపర్ లగ్జరీ స్పెషల్ బస్సుకు ఆన్‌లైన్‌లో టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు. బస్సుకు సరిపడా భక్తులు ఉండి, ఏ రోజైనా కోరితే తగిన చార్జీలతో వారి ఊరు నుంచే సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులు నడుపుతామని తెలిపారు. వివరాలకు 95023 00189 నంబరును సంప్రదించాలన్నారు.
ప్రకృతిని పరిరక్షిద్దాం
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం సిటీ: ప్రకృతిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనాన్ని పెంచి, పర్యావరణ హిత జీవనశైలిని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. ఆమెతో పాటు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా శనివారం స్థానిక వీఎల్ పురంలో స్వచ్ఛ ఆంధ్రా– స్వర్ణ ఆంధ్రాలో భాగంగా క్లీన్ ఎయిర్ థీమ్‌తో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమని, భావితరాల భవిష్యత్తు అందరి చేతుల్లో ఉందన్నారు. పర్యావరణ హిత జీవనశైలితో స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకర జీవనాన్ని పొందవచ్చన్నారు. హరిత విస్తీర్ణం పెంపుతో పాటు, ప్రజా రవాణా, సౌర విద్యుత్ వినియోగానికి ప్రోత్సాహం వంటి చర్యల ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చన్నారు. కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, ఇప్పటివరకు నగరంలో 4,780 మొక్కలు నాటినట్టు వివరించారు. దీపావళిలో గ్రీన్ టపాసులు వినియోగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, ఎస్‌ఈ (ఇన్‌చార్జి) రీటా, ఎంహెచ్‌ఓ వినూత్న, ఈఈ మదర్షా అలీ, ఏడీహెచ్ అనిత, సీఎంఎం రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్ 5, 6 తేదీల్లో
అంతర్జాతీయ సదస్సు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో భౌతిక, రసాయన జీవ శాస్త్రాల్లో సరిహద్దులు–వ్యవసాయ, ఆహార, సాంకేతికత, ఔషధ ఆవిష్కరణ, పర్యావరణ స్థిరత్వంలో అనువర్తనాలు అనే అంశంపై డిసెంబర్ 5, 6 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు జరుగుతుందని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను శనివారం విడుదల చేశారు. అలియోంకీ పబ్లిష్కో(హైదరాబాద్) సహకారంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దీనికి చైర్మన్‌గా ప్రొఫెసర్ చంద్రమౌళి, కన్వీనర్‌గా డాక్టర్ బి.జగన్‌మోహన్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా డాక్టర్ కె.దీప్తి, పబ్లిష్కో డైరెక్టర్ స్వాతి గోనుగుట్ల వ్యవహరిస్తారన్నారు. సదస్సుకు సంబంధించిన పరిశోధన పత్రాలను నవంబర్ 24లోగా సమర్పించవచ్చన్నారు.

ఆనంద దీపావళి చేసుకోండి