
రత్నగిరి భక్త జనసంద్రం
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది
● స్వామివారి ఆదాయం రూ.25 లక్షలు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 1,800 స్వామివారి వ్రతాలు జరిగాయి. భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణలు చేసి, రావిచెట్టు వద్ద దీపాలు వెలిగించారు. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నాలుగు వేల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. ఇలాఉండగా, ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను తిరుచ్చి వాహనంపై ప్రతిష్ఠించి అర్చకులు పూజలు చేశారు. వేద పండితుల మంత్రోఛ్చాటన మధ్య మంగళ వాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా, మూడు సార్లు ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
తిరుపతిలో పోటెత్తిన భక్తులు
పెద్దాపురం(సామర్లకోట): పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసిన శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూల నుంచి అనేక మంది భక్తులు కాలినడకన చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. సుమారు పది వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్టు ఆలయ ఈవో వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,47,150, అన్నదాన విరాళాలుగా రూ.54,035, కేశ ఖండన ద్వారా రూ.4,240, తులాభారం ద్వారా రూ.50, ప్రసాద విక్రయం ద్వారా రూ.16,845, స్వామివారికి కానుకగా రూ.101తో మొత్తం రూ.2,22,421 ఆదాయం వచ్చిందని చెప్పారు. సుమారు 3,500 మంది భక్తులు మధ్యాహ్నం అన్న ప్రసాదం స్వీకరించారు.

రత్నగిరి భక్త జనసంద్రం