
స్వల్పంగా పెరిగిన పొగాకు ధర
● కిలో గరిష్టం రూ.430 ● లో గ్రేడ్ రూ.80
దేవరపల్లి: పొగాకు మార్కెట్ ఒడిదొడుకుల్లో కొనసాగుతోంది. మార్కెట్ నిలకడ లేకపోవడంతో ధర ఎగసిపడుతోంది. రెండు వారాల పాటు మార్కెట్లో పొగాకు ధర కిలో రూ.425 కొనసాగింది. రెండు రోజులుగా ఈ ధర పెరుగుతూ వస్తోంది. శనివారం మార్కెట్లో కిలో గరిష్ట ధర రూ.430 పలికింది. 2024–25 పంట కాలంలో పండించిన పొగాకు కొనుగోళ్లను పొగాకు బోర్డు మార్చి 24న ప్రారంభించింది. శనివారం నాటికి 168 రోజులు జరిగిన వేలం ప్రక్రియలో మార్కెట్ అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంది. కొనుగోళ్లు ప్రారంభంలో కిలో గరిష్ట ధర రూ.290 పలికింది. ఈ ధర దాదాపు రెండు నెలలు కొనసాగింది. ఆ సమయంలో చాలా మంది చిన్న రైతులు తమ వద్ద ఉన్న పొగాకును అమ్ముకోగా, పెద్ద రైతులు నిల్వ ఉంచారు. అనంతరం మార్కెట్ అంచెలంచెలుగా నిలదొక్కుకుని, రోజురోజుకూ ధర పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం కిలో గరిష్ట ధర రూ.430 పలకడంతో.. ముందుగా అమ్ముకున్న చిన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొనుగోళ్లు ప్రారంభంలో ధర కంటే ప్రస్తుత ధర కిలోకు రూ.140 పెరగడంతో ముందుగా అమ్ముకున్న రైతులు డీలా పడ్డారు. ఈ ఏడాది పొగాకు రైతుల పంట పండిందని చెప్పవచ్చు. గతేడాది కంటే కిలోకు రూ.30 గరిష్ట ధర అదనంగా రైతులకు లభించింది. గతేడాది కిలో రూ.410 పలికిన పొగాకు.. ఈ ఏడాది రూ.430 పలుకుతోంది. లో గ్రేడ్ మార్కెట్ ఎగిసిపడుతోంది. మొన్నటి వరకూ కిలో ధర రూ.60 నుంచి రూ.70 పలకగా, ఈ ధర రూ.60 నుంచి రూ.80కి చేరింది. అయినా లో గ్రేడ్ పొగాకు కొనుగోళ్లకు ట్రేడర్లు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో సుమారు 84 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేయగా, ఇప్పటి వరకు 74.29 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. మరో 10 మిలియన్ల కిలోల పంట కొనుగోలు చేయాల్సి ఉంది.