
సాయం చేసే చేతులేవీ..?
చితికిపోయినా..
సాక్షి, ప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రభుత్వానికి మానవత్వం బొత్తిగా లేకుండా పోతోంది. ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవలసిన బాధ్యతను విస్మరిస్తోంది. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో సంభవించిన బాణసంచా విస్ఫోటంలో ప్రాణాలు కోల్పోయిన పది మందిలో బాణసంచా తయారీ దుకాణం యజమాని తప్ప మిగిలిన వారంతా రెక్కాడితే కానీ డొక్కాడని వారే. ఈ పెను విషాదం జరిగి వారం రోజులు గడిచినా మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి నాలుగు మాటలు చెప్పి వెళ్లడమే తప్ప తక్షణ సాయం అందించే దిశగా ఎటువంటి చర్యలు లేవు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఎప్పుడో ఓ టీడీపీ కార్యకర్త హత్యకు గురైతే ఆ కుటుంబంలో ఒకరికి ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. అదే ఉదారత రాయవరం ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిపై లేకపోవడం ఏంటని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని బుధవారం రాయవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాలు ధర్నాకు దిగి అధికారులను నిలదీశాయి
ఈ దుర్ఘటనలో బిక్కవోలు మండలం కొమరిపాలేనికి చెందిన బాణసంచా యూనిట్ యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) మినహాయిస్తే మిగిలిన వారంతా పొట్టకూటి కోసం బాణసంచా తయారీకి వచ్చిన వారే. కొమరిపాలేనికి చెందిన పొట్నూరి వెంకటరమణ, రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన పాకా అరుణ, వాసంశెట్టి విజయలక్ష్మి, అనపర్తికి చెందిన చిట్టూరి శ్యామల, చిట్టూరి యామిని, అనపర్తి సావరానికి చెందిన కుడుపూడి జ్యోతి, పెంకే శేషారత్నం, కొమరిపాలెం, పెదపూడి మండలం వేండ్రకు చెందిన లింగం వెంకటకృష్ణ, ఒడిశాకు చెందిన కె. సదానందం మృతులు. యజమాని మినహా మిగిలిన వారంతా ఎస్సీ, బీసీ సామాజికవర్గాల వారే. తమ ప్రభుత్వం ఎస్సీ, బీసీలకు అగ్రాసనం వేస్తుందని గొప్పగా చెప్పుకొనే సర్కార్ కనీసం వారిని ఆదుకోవాలని ఆలోచించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఘటన జరిగిన రోజు రాష్ట్ర హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత, కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి వెళ్తున్నారు తప్ప ఎటువంటి సాయం ప్రకటించకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశా రు. అలా కాదని సాయం కోసం ప్రశ్నిస్తే ఇచ్చే సాయం ఇవ్వరేమోననే భయం వారిని మాట్లాడనీయలేదు. వా రిని పక్కనబెడితే కూటమి నేతలైన మండపేట, అనపర్తి ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బాధిత కుటుంబాలను పలకరించి ప్రభుత్వ పరంగా న్యాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారే తప్ప ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడం విస్మయానికి గురిచేసింది.
అసలు సంఘటన జరిగిన రోజు వచ్చిన సందర్భంలోనే మంత్రులు ప్రభుత్వ సాయాన్ని ప్రకటించాల్సి ఉంది. అలా కాకుండా ఈ ఘటనపై సమీక్షించిన తరువాత అయినా ఆర్థిక సాయాన్ని ప్రకటించాల్సి ఉంది. కాగా బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాత్రం జ్యుడీషియల్, ప్రభుత్వం వైపు నుంచి విచారణ జరుగుతోంది, పరిహారం ఎలా ఇవ్వాలనేది ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కాలయాపనపై ప్రజా సంఘాలు కార్మిక న్యాయస్థానానికి వెళ్లేందుకు సిద్ధపడుతున్నాయి.
కాగా, ఈ దుర్ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తనంతట తానుగా మంగళవారం కేసు నమోదుచేస్తున్నట్టు ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు కారణాలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రశ్నించింది. మీడియా కథనాల ఆధారంగా కేసు నమోదుచేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. బాఽధితుల సమీప బంధువులకు పరిహారం అందించారా అనే విషయాన్ని కూడా రెండు వారాల్లో అందించే నివేదికలో పొందుపరచాలని ఆదేశించింది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత విషాదకర ఘటనగా నిలిచిపోయిన వాకతిప్ప బాణసంచా పేలుడు 2014 అక్టోబర్ 10వ తేదీన జరిగింది. ఆ దుర్ఘటనలో 18 మంది మృతి చెందారు. నాడు ప్రతిపక్ష నేతగా జగన్ ఒకో కుటుంబానికి రూ.50 వేలు సొంత నిధులు అందించి ఆదుకున్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ తొలుత లక్షన్నర పరిహారం ప్రకటించింది. జగన్ వచ్చి వెళ్లాక ఆర్థిక సాయాన్ని రూ.3 లక్షలు చేసింది. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఇలాంటి ఘటనలు జరిగినపుడు ప్రభుత్వం మానవత్వంతో ఆదుకున్న ఉదంతాలు కోకొల్లలు. సామర్లకోట మండలం జి. మేడపాడులో 2019 అక్టోబర్‌లో బాణసంచా తయారు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో మృతుల కుటుంబాలకు జగన్ ప్రభుత్వం సుమారు రూ.15 లక్షలు సాయం అందించింది. రంపచోడవరం మన్యం ప్రాంతంలో కచ్చులూరు వద్ద 2019లో పాపికొండలకు వెళ్లే పర్యాటక బోటు బోల్తా పడిన సంఘటనలో 48 మంది మృత్యు వాతపడ్డారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున సాయం అందించింది. అలాగే తాళ్లరేవు మండలం జి.వేమవరంలో బాణసంచా పేలుడు ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. వెంటనే కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారాన్ని, క్షతగాత్రులకు రూ.3 లక్షలు అప్పటి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు.
ప్రభుత్వ తీరుపై సర్వత్రా విస్మయం
పది మంది ప్రాణాలు పోయినా
పరిహారానికి మీనమేషాలు
ఎదురుతెన్నులు చూస్తున్న
బాధిత కుటుంబాలు
సర్కార్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
జగన్ హయాంలో
24 గంటల్లోనే సాయం
నేడు ఉన్నత స్థాయి కమిటీ రాక
రాయవరం: బాణసంచా ప్రమాద ఘటనపై విచారణ నిమిత్తం ఉన్నత స్థాయి కమిటీ శుక్రవారం రాయవరం రానుంది. ఈ విషయాన్ని తహసీల్దార్ బీవీ భాస్కర్ తెలిపారు. ఉన్నత స్థాయి కమిటీలో ప్రిన్సిపల్ సెక్రటరీ టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు శాఖ నుంచి ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) రానున్నట్లు తెలిసింది. వీరి వెంట జిల్లా అధికారులు ఉంటారు. ప్రమాద ఘటన తీరుతెన్నులను ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించే అవకాశముంది. అలాగే బాధిత కుటుంబాలతో మాట్లాడవచ్చు. పరిశీలన అనంతరం ఉన్నత స్థాయి కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.