
ఘాట్ల అభివృద్ధికి ప్రతిపాదనలు
● అధికారులకు కలెక్టర్ ఆదేశం
● గోదావరిలో బోటుపై ప్రయాణించి పరిశీలించిన కీర్తి
తాళ్లపూడి (కొవ్వూరు): గోదావరి పుష్కరాల దృష్ట్యా ఘాట్ల అభివృద్ధి, సౌకర్యాలు, భక్తులకు సురక్షిత ఏర్పాట్లపై హేతుబద్ధమైన విధానంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం, కృష్ణచైతన్య, భక్తాంజనేయ, శివాలయం, పిండ ప్రదానం, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్, హేవలాక్ బ్రిడ్జి, శ్రీనివాస, ఎరినమ్మ తదితర ఘాట్‌లను ఆమె గురువారం పడవ ద్వారా పరిశీలించారు. కుమారదేవం వద్ద సినిమా చెట్టును ఘాట్‌ను కూడా పరిశీలించారు. ఎరినమ్మ ఘాట్ నుంచి గోష్పాద ఘాట్ వరకూ పడవలో తిరుగు ప్రయాణమయ్యారు. అనంతరం గోదావరి నీరాజనం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ, కొవ్వూరు డివిజన్‌లో పుష్కర ఘాట్ల వద్ద భక్తుల సౌకర్యం, శుభ్రత, రవాణా, భద్రత తదితర అంశాలపై అన్ని శాఖలూ సమన్వయంతో పని చేయాలని అన్నారు. పుష్కరాల ప్రారంభానికి ముందే ఆయా శాఖలు ప్రతిపాదించిన పనులు పూర్తి చేయాలన్నారు. పుష్కరాల ఏర్పాట్లపై ఉన్నత స్థాయిలో ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమీక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో, జిల్లా స్థాయిలో అన్ని విభాగాలూ సమన్వయంతో ముందస్తు సన్నాహాలు వేగవంతం చేసేలా క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తున్నామని చెప్పారు.
వివిధ అంశాలపై విభాగాల వారీగా సమీక్షించి, తక్షణమే లోపాలను సరిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొవ్వూరు వద్ద గోదావరి తీరంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు నిర్మాణంలో ఉన్న పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టు పురోగతిని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. 26 కాటేజీలు, బార్, రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్, కాన్ఫరెన్స్ హాలు వంటి సౌకర్యాలతో కూడిన ఈ ప్రాజెక్టులో 60 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు 2027 పుష్కరాల ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో కొవ్వూరు ఆర్‌డీఓ రాణి సుస్మిత, జిల్లా పర్యాటకాధికారి పి.వెంకటాచలం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.