
రైతు అదృశ్యంపై కేసు
నిడదవోలు: ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామానికి చెందిన రైతు కోడూరి వెంకట్రావు (65) అదృశ్యంపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఇంటి నుంచి మోటార్ సైకిల్‌పై బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.రవికుమార్ తెలిపారు. ఆచూకీ తెలిచిన వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
అంబాజీపేట: ప్రేమించమని వెంట పడుతున్నా ఓ యువతి నిరాకరించడంతో యువకుడు అంబాజీపేట బస్టాండ్‌లో శనివారం రాత్రి గొంతు కోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. అంబాజీపేటకు చెందిన ఒక యువతి అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో బీఎస్సీ నర్సింగ్ చదువుతూ విధులు నిర్వహిస్తోంది. ఆ యువతిని ఇరుసుమండకు చెందిన ఎస్.పవన్ కొన్ని నెలలుగా ప్రేమించమని వెంటపడి వేధిస్తున్నాడు. శనివారం సాయంత్రం స్థానిక బస్టాండ్‌లో పవన్ ఆ యువతితో ప్రేమ విషయమై మాట్లాడాడని, ఆమె నిరాకరించడంతో బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి హెచ్‌సీ పీవీవీఎస్‌ఎన్ మూర్తి చేరుకుని పవన్‌ను చికిత్స నిమిత్తం అమలాపురం ఆసుపత్రికి తరలించారు.
డీఎస్సీ టీచర్లకు
పోస్టింగ్ ఆర్డర్లు
రాయవరం: డీఎస్సీ–2025 ఉపాధ్యాయులుగా ఎంపికై న వారికి పోస్టింగ్ ఆర్డర్లు విడుదలయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,659 మంది ఇండక్షన్ ట్రైనింగ్‌కు హాజరైన విషయం విదితమే. ట్రైనింగ్ పొందిన ఉపాధ్యాయుల్లో 524 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఈ నెల 9న మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ నెల 9, 10 తేదీల్లో 811 మంది స్కూల్ అసిస్టెంట్లు, జోన్–2 పరిధిలోని 324 మంది టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్ల ద్వారా పోస్టింగ్ ప్లేస్‌లను ఎంపిక చేసుకున్నారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో లీప్ యాప్ ద్వారా పోస్టింగ్ ఆర్డర్లు విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి పేరిట ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఉపాధ్యాయులు 13న విధుల్లో చేరే అవకాశముంది.