
రత్నగిరిపై సంప్రోక్షణ పూజలు ప్రారంభం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సంప్రోక్షణ పూజలు, శాంతి హోమం సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆలయంలోని దర్బారు మండపంలో ఉదయం తొమ్మిది గంటలకు ఈ పూజలు, హోమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. తొలుత కలశాలతో మండపారాధన చేశారు. వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య ఈ పూజలు నిర్వహించారు. తర్వాత శాంతి హోమానికి అంకురార్పణ చేశారు. అన్నవరం దేవస్థానంలో కొన్ని నెలలుగా అనేక అగ్ని ప్రమాదాలు, అపశ్రుతులు జరిగిన నేపథ్యంలో ఈ సంప్రోక్షణ పూజలు, శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు పండితులు తెలిపారు. బుధవారం ఉదయం శాంతి హోమం పూర్ణాహుతితో కార్యక్రమాలు ముగుస్తాయన్నారు. తరువాత మంత్ర జలాన్ని దేవస్థానం ఆవరణలో వెదజల్లి శుద్ధి చేస్తారు. దేవస్థానంలో చాలాకాలంగా సంప్రోక్షణ పూజలు కాని, ప్రత్యేక యాగాలు, కోటి తులసి పూజలు కాని జరగకపోవడంతో మూడు నెలల నుంచి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు పండితులు, అర్చకస్వాములు అభిప్రాయపడ్డారు. దీనిపై ఈ నెల 7న ‘సాక్షి’ దినపత్రికలో ‘అపశ్రుతులు అందుకేనా..?’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దానికి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు స్పందించి శాంతి పూజలు నిర్వహించాలని దేవస్థానం పండితులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పూజల్లో చైర్మన్ ఐవీ రోహిత్‌తో పాటు వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరబట్ల గంగబాబు, చిట్టి శివ, యనమండ్ర శర్మ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు దత్తాత్రేయ శర్మ, కంచిబట్ల సాయిరామ్, కల్యాణ బ్రహ్మ ఛామర్తి కన్నబాబు తదితర బృందం పాల్గొన్నారు.