
కళాశాల బస్సును ఢీకొన్న వ్యాన్
13 మంది విద్యార్థులకు గాయాలు
దేవరపల్లి: ప్రైవేటు కళాశాల బస్సును బొలెరో వ్యాన్ ఢీకొన్న ఘటనలో బస్సులోని 13 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇందులో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి వద్ద ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సు సుమారు 40 మంది విద్యార్థులతో సోమవారం ఉదయం కళాశాలకు వెళుతుండగా, కృష్ణంపాలెం వద్దకు వచ్చేసరికి విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి కిరాణా సరకులతో వెళుతున్న వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా స్థానిక పీహెచ్‌సీలో వైద్యం చేసి ఇళ్లకు పంపించారు. వ్యాన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు.