
కమనీయం.. కడు రమణీయం
● వాడపల్లిలో శ్రీనివాసుని కల్యాణం
● కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
● యోగనారసింహ అలంకరణలో
శ్రీవారు విహారం
కొత్తపేట: శ్రీవారు ఓరకంట చూడగా.. అమ్మవారు సిగ్గులమొగ్గగా మారగా.. జగద్రక్షకుడి కల్యాణం కన్నుల పండువగా జరగ్గా.. ఈ క్రతువును తిలకించిన భక్తజనం మురిసిపోగా.. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ్రీనివాసుని కల్యాణం అట్టహాసంగా జరిగింది. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం చూసిన కనులదే భాగ్యం అన్నట్లు సాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తజనం కల్యాణోత్సవాన్ని, వాహన సేవను తిలకించి పులకించింది. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో వాడపల్లి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం, వివిధ ప్రాంతాల వేద పండితులు ఉదయం నుంచి రాత్రి వరకూ నిరంతరాయంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు తదితర పూజలు చేశారు. ఉదయం నుంచి స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అష్టకలశారాధన, మహాస్నపనం, ప్రధాన హోమాలు, నీరాజన మంత్రపుష్పం, దిగ్దేవతా బలిహరణ తదితర పూజలు నిర్వహించారు.
కనుల వైకుంఠం.. శ్రీనివాసుని కల్యాణం
లోక సంక్షేమార్థం శ్రీనివాసుని కల్యాణ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రదానం నుంచి తలంబ్రాల వరకూ వేదపండితుల వ్యాఖ్యానం నడుమ వైభవంగా నిర్వహించారు. సర్వాభరణ భూషితులైన స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి తీసుకువచ్చి మండపంలో అలంకరించారు. దేవస్థానం తరఫున డీసీ అండ్ ఈఓ చక్రధరరావు దంపతులు, ఉత్సవ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, కల్యాణ మాలలు తదితరాలు సమర్పించారు. నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర బెల్లం ధరింపజేసి, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. సాయంత్రం 5.30 గంటల నుంచి స్వస్తివచనం, ప్రధాన హోమాలు, స్వామివారికి విశేషార్చన, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్రపుష్పం జరిపారు.
సింహ వాహనంపై ఊరేగిన శ్రీవారు
శ్రీవారు యోగనారసింహ అలంకరణలో సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి సింహ వాహనంపై స్వామివారిని అలంకరించగా, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా పండితులు సింహ వాహనంపై శ్రీవారు విహార ఘట్టం విశిష్టతను వివరించారు. ఈ ఘట్టం భక్తులకు ఐశ్వర్యం, యశస్సు, శ్రీ, జ్ఞానం తదితర గుణాలను ప్రసాదిస్తారని అర్థం. సింహం ధైర్యం, వేగం, చురుకుదనానికి ప్రతీక. కాబట్టి స్వామివారు ఈ వాహనంపై ఊరేగుతూ పైలక్షణాలను అనుగ్రహిస్తారు. యోగనారసింహ రూపంలో శ్రీవారిని దర్శించిన వారికి మంచి జరుగుతుందని వివరించారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేంకటేశ్వర స్వామివారి వేషధారణలో ఒక కళాకారుడు ఆకట్టుకున్నారు. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై రాము బందోబస్తు నిర్వహించారు.
నేటి కార్యక్రమాలు ఇవీ..
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం బ్రహ్మోత్సవాల నిత్య పూజలు, హోమాలు, అభిషేకాలతో పాటు ఉదయం వసంతోత్సవం, అష్టదళ పాదపద్మారాధన నిర్వహిస్తారు. సాయంత్రం హనుమత్ మూలమంత్ర హవనం, అష్టోత్తర శత కలశారాధన, పంచశయ్యాధివాసం విశేష పూజలు, సేవలు, రాత్రి మలయప్ప అలంకరణతో గరుడ వాహనసేవ నిర్వహిస్తారు.

కమనీయం.. కడు రమణీయం