
రోడ్డు ప్రమాదంలో రికార్డ్ అసిస్టెంట్ మృతి
అనపర్తి, రాయవరం: రోడ్డు ప్రమాదంలో జూనియర్ కళాశాల రికార్డ్ అసిస్టెంట్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కడియం మండలం వేమగిరి గ్రామానికి చెందిన మట్టపర్తి శ్రీనివాస్ (52) రాయవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. రోజూలాగే వేమగిరి నుంచి అనపర్తి కొప్పవరం మీదుగా రాయవరంలోని కళాశాలకు బయలుదేరారు. తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుండడంతో కొప్పవరం గ్రామ శివారుకు చేరుకునే సరికి ఆయన బైక్ రోడ్డుపై జారి పోయింది. వాహనంతో పాటు ఆయన రోడ్డుపై పడిపోవడంతో అపస్మారక స్థితికి చేరుకోగా స్థానికులు గమనించారు. ఆయన జేబులోని సెల్‌ఫోన్ తీసి రాయవరం కళాశాలలోని సహోద్యోగులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి హుటాహుటిన అనపర్తి ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందారు. ఈ మేరకు ట్రైనీ ఎస్సై సుజాత కేసు నమోదు చేశారు.