
గుండె లయ తప్పుతోంది
●
రాయవరం: ఇటీవలి కాలంలో ఎవరైనా అకస్మాత్తుగా మరణిస్తే ఎలా చనిపోయారు అని ప్రశ్నించగానే ఎక్కువగా వినిపించే సమాధానం గుండెపోటు. వయసుతో సంబంధం లేకుండా చోటు చేసుకునే మరణాల్లో హార్ట్ ఎటాక్‌తో జరిగేవే అధికం. మన శరీరానికి పెద్దదిక్కుగా వ్యవహరించే హృదయం లయ తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. సోమవారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
అతి ప్రధానమైన అవయవం
మనిషి శరీరంలో పనిచేసే అవయవాల్లో అతి ప్రధానమైనది గుండె. దీనికి ప్రస్తుత పరిస్థితుల్లో భద్రత లేకుండా పోతోంది. వ్యాయామం లేకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం. పొగ తాగడం, ఒత్తిళ్లతో గుండెపోటుకు గురవుతున్నారు. మనుషుల్లో మారుతున్న అలవాట్లు, ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలకు దారి తీయడంతోపాటు అంతిమంగా గుండైపె ప్రభావం పడుతోంది. అయితే మధుమేహం (సుగర్)తోనే అధిక ముప్పు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
యువకుల నుంచి
వృద్ధుల వరకు
రెండు దశాబ్దాల కిందట 50 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే వచ్చే గుండెపోటు, మారిన జీవన శైలి కారణంగా నేడు 20 ఏళ్ల యువకుల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు వస్తోంది. వీరిలో 30 ఏళ్ల వయసువారే ఎక్కువ మంది ఉంటున్నారు. దీనికి కారణం అధిక ఒత్తిడి, ధూమపానం, మద్యం, సుగర్, ఫాస్ట్ ఫుడ్ , లావు పెరగడం, శరీరంలో చెడు కొలెస్ట్రాల్, నిద్రలేమి, అధికంగా ఫోన్ చూడడం, ప్యాక్డ్ ఫుడ్‌ను అధికంగా తీసుకోవడం, మితిమీరి శీతలపానీయాలు తాగడం, తరచుగా ఆయిల్ ఫుడ్‌ను తీసుకోవడం.
జిల్లాలో 14 శాతం బాధితులు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు 14 శాతం ఉన్నట్లు అంచనా. ఆకస్మిక హృద్రోగ సమస్య ఎదురైన వారిలో 10 శాతం మంది మాత్రమే చికిత్స పొంది, కోలుకుంటున్నారు. హైపర్ టెన్షన్‌తో ఇబ్బంది పడేవారు 1.06 లక్షల మంది, సుగర్ వ్యాధిగ్రస్తులు 43వేల మంది ఉన్నారు.
కోవిడ్–19తో పెరిగిన కేసులు
జిల్లాలో కోవిడ్ వైరస్ వల్ల గుండె సమస్యలు 50 నుంచి 60 శాతానికి పెరిగాయి. గతంలో అధిక కొలెస్ట్రాల్, బీపీ, సుగర్, మద్యం, సిగరెట్ వల్ల ఈ సమస్య ఉండేది. గుండె నొప్పి, అధిక ఆయాసం ఉంటే వెంటనే కార్డియాలజిస్టును సంప్రదించి, చికిత్స తీసుకోవాలి.
ఈ జాగ్రత్తలు పాటించాలి
మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి.
జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.
ఆహారంలో సాధ్యమైనంతవరకు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు రోజుకు కనీసం 20 నుంచి 45 నిమిషాలు వ్యాయామం చేయాలి.
బీపీని అదుపులో ఉంచుకోవాలి.
పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా విటమిన్ లోపాలను అధిగమించవచ్చు.
మాంసం, కొవ్వు పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.
పార్కులు, ఇతర ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం ద్వారా ఒత్తిడిని జయించాలి.
కరోనాతో మరింత పెరిగిన
గుండెపోటు బాధితులు
ఆహారపు అలవాట్లు
అదుపు చేసుకుంటేనే మంచిది
నేడు వరల్డ్ హార్ట్ డే

గుండె లయ తప్పుతోంది