
రావులపాలెం అభివృద్ధికి కృషి చేయాలి
రావులపాలెం: నూతనంగా ఎన్నికై న చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు వ్యాపారుల సమస్యలు పరిష్కరించడంతోపాటు, రావులపాలెం అభివృద్ధికి కృషి చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. స్థానిక సీఆర్‌సీ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం పూర్వపు అధ్యక్షుడు కర్రి నాగిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన అధ్యక్షుడిగా పోతంశెట్టి కనికిరెడ్డి, ఉపాధ్యక్షులుగా కర్రి శ్రీనివాస్‌రెడ్డి, మామిడిశెట్టి సోమరాజు, ఆకుల శివశంకర్, ప్రధాన కార్యదర్శిగా మల్లవరపు సూరిబాబు, సంయుక్త కార్యదర్శులుగా కొవ్వూరి వంశీకృష్ణారెడ్డి, మన్యం ప్రదీప్, మల్లూరి నీలకంఠ దుర్గారావు, కోశాధికారిగా మండవిల్లి నగేష్, సహ కోశాధికారిగా కండిచర్ల వీర వెంకట నాగరాజుతో ఎమ్మెల్యే బండారు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కార్యవర్గాన్ని అభినందించారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులను మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అభినందించారు. కనికిరెడ్డికి ఆయన శాలువా కప్పించి అభినందించారు. మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర బీసీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ రెడ్డి అనంత కుమారి, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కేవీ సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, సర్పంచ్ తాడేపల్లి నాగమణి, ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి పాల్గొన్నారు.
చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

రావులపాలెం అభివృద్ధికి కృషి చేయాలి