
డీఎల్‌పీఓ కార్యాలయ ఏఓపై విచారణకు ఆదేశం
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): కాకినాడ డీఎల్‌పీఓ కార్యాలయంలో ఏఓగా పనిచేస్తున్న సీహెచ్ వెంకటరెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై డీఆర్వో జె.వెంకట్రావు విచారణకు ఆదేశించారు. పలువురు ఎస్సీ, బీసీ ఉద్యోగులపై తప్పుడు గ్రీవెన్స్ ఫిర్యాదులు చేయిస్తూ ఆ ఫిర్యాదులు క్లోజ్ చేయడానికి సదరు ఉద్యోగుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలపై సోషల్ వేల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ శోభారాణిని విచారణ అధికారిగా నియమించారు. దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కోఆర్డినేటర్ పి.చెంగల్‌రావు ఆధ్వర్యంలో పలు దళిత గిరిజన సంఘాల నాయకులు ఈ విషయంపై సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన డీఆర్వో విచారణ అధికారిని నియమించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులపై సంబంధం లేని వ్యక్తులతో తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారన్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తిరిగి ఉద్యోగం ఇప్పించే విషయంలో, బెనిఫిట్స్ ఇచ్చే విషయంలో మహిళలను కావాలనే ఉద్దేశపూర్వకంగా తన చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వెంకటరెడ్డి ఫోన్ కాల్ హిస్టరీని పరిశీలిస్తే నిజాలు బయటికి వస్తాయన్నారు. డీఆర్వోకు ఫిర్యాదు చేసిన వారిలో రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు, జై భీమ్‌రావు భారత్ పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ, బహుజన సమాజ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాత సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.