
కొబ్బరి చెక్కల వేలం రూ.7.06 లక్షలకు ఖరారు
పెరవలి: అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో (2025–26) ఏడాది కాలానికి కొబ్బరి చెక్కలు పోగుచేసుకునేందుకు రూ.7.06 లక్షలకు వేలం ఖరారైంది. అలాగే తలనీలాలు తీసుకునేందుకు రూ.71 వేలకు పాడుకున్నారు. ఆలయ ఆవరణలో అధికారుల సమక్షంలో మంగళవారం ఈ వేలం పాటలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ మొదటి ఏడాది ఈ విధంగా ఉండగా, 2026 – 27లో ప్రస్తుతం పాడిన పాటపై 10 శాతం పెంచి సొమ్ములు కట్టించుకుంటామన్నారు. దీని ద్వారా వచ్చే ఏడాది రూ.7,76,600 వస్తుందన్నారు. ఈ వేలం పాటలో గత ఏడాది కంటే రూ.2,73,500 ఎక్కువ ఆదాయం వచ్చిందన్నారు. దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారి జి.సత్యప్రసాద్ నేతృత్వంలో గ్రామ పెద్దలు రంగినీడి కట్లయ్య, బొలిశెట్టి ప్రసాద్ తదితరుల సమక్షంలో వేలం నిర్వహించారు.
రూ.636.97 కోట్లతో
డిజిటల్ సూక్ష్మ రుణ ప్రణాళిక
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో 2025–26 సంవత్సరానికి గాను 10,635 సంఘాలకు రూ.636.97 కోట్లతో డిజిటల్ సూక్ష్మ రుణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ మూర్తి తెలిపారు. ఆయన మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మూర్తి మాట్లాడుతూ ప్రతి స్వయం సహాయక సంఘం నుంచి ఇద్దరు మహిళా సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి రుణ సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణ పేరుతో కుట్ర
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని మాల మహానాడు అండ్ రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్ రత్నాకర్ అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా అతి పెద్ద రాజకీయ కుట్ర చేస్తున్నారన్నారు. నిజానికి ఎస్సీ వర్గీకరణతో వంద మందిలో నలుగురికే లబ్ధి చేకూరుతుందన్నారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం అంటున్నారని, అయితే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి పదవులను ఎస్సీలకు ఇవ్వగలరా అని ప్రశ్నించారు.
వేతన బకాయిలు
విడుదల చేయాలి
రాజమహేంద్రవరం రూరల్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లాలోని విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్లు (వీవోఏలు) మంగళవారం బొమ్మూరులోని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. బకాయి వేతనాలు చెల్లించాలని, కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని నినాదాలు చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.పవన్ మాట్లాడుతూ 5జీ మొబైల్ ఇవ్వకుండా ఆన్‌లైన్ వర్కులు చేయలేదని వేధించడం తగదన్నారు. సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవి స్వరూపారాణి, మహాలక్ష్మి మాట్లాడుతూ వీఓఏలపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని కోరారు. అనంతరం డీఆర్‌డీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శిరీష, గణికమ్మ బేబీ, కుసుమకుమారి, సత్యవతి, సీతామహాలక్ష్మి పాల్గొన్నారు.

కొబ్బరి చెక్కల వేలం రూ.7.06 లక్షలకు ఖరారు

కొబ్బరి చెక్కల వేలం రూ.7.06 లక్షలకు ఖరారు