
గౌరవ వేదన
బకాయిలు దారుణం
ఇమామ్‌లు, మౌజన్‌లకు 11 నెలలుగా గౌరవ వేతనం మంజూరు చేయకపోవడం దారుణం. కూటమి ప్రభుత్వ తీరుతో వారందరూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆదాయం లేని మసీదుల నిర్వహణ కష్టంగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఇలాంటి ఇబ్బంది లేదు.
– మహ్మద్ ఆరీఫ్,
వక్ఫ్‌బోర్డు జిల్లా మాజీ అధ్యక్షుడు
తక్షణమే మంజూరు చేయాలి
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రకారం కూటమి ప్రభుత్వం మసీదుల నిర్వహణకు రూ.5 వేలు చొప్పున తక్షణమే నిధులు విడుదల చేయాలి. ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌరవ వేతనాలను వెంటనే అందజేయాలి. 11 నెలలుగా వేతనాలు లేక వారందరూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
– ఎస్‌కే ఇబ్రహీం బాషా,
మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి
పెరవలి: మైనార్టీల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి అవలంబిస్తోంది. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించింది. ముఖ్యంగా ఇమామ్, మౌజన్‌లకు దాదాపు 11 నెలలుగా గౌరవ వేతనం చెల్లించడం లేదు. మసీదు నిర్వహణ నిధుల మాటే మర్చిపోయింది. దీంతో వారందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మసీదులకు సొంతంగా ఆదాయం ఉండదు. వాటిని నిర్వహించే ఇమామ్‌లు, మౌజన్లు ప్రతి నెలా ప్రభుత్వమిచ్చే గౌరవ వేతనాల పైనే ఆధారపడతారు. ఈ నేపథ్యంలో గౌరవ వేతనాలు విడుదల చేయాలంటూ మైనార్టీలు నేరుగా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
కూటమి కక్ష సాధింపు!
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి వరకూ ఇచ్చిన వేతనాన్ని రెట్టింపు చేసి, ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేల చొప్పున ప్రతి నెలా పంపిణీ చేసేవారు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితి మారిపోయింది. ముస్లింలపై నిర్లక్ష్య వైఖరిని అవలంబించే కూటమి నాయకులు.. 11 నెలలుగా గౌరవ వేతనం మంజూరు చేయడం లేదు. దీంతో వారందరూ ఆర్థికంగా నలిగిపోతున్నారు. జగన్ ముఖ్యమంత్రి ఉండగా ఎప్పుడూ ఇలాంటి ఇబ్బంది తలెత్తలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని వారందరూ వాపోతున్నారు.
రూ.1.95 కోట్ల బకాయిలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తుంటే.. దాదాపు 11 నెలల నుంచి గౌరవ వేతనాలు బకాయిలు ఉన్నాయంటే మసీదుల విషయంలో వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. చిన్న కార్యక్రమాలకు కూడా రూ.కోట్ల ప్రజాధనంతో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరిగే కూటమి నాయకులకు.. మసీదు నిర్వహణ మాత్రం భారంగా మారడం దారుణం. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వేతనం అందుకునే ఆదాయం లేని మసీదులు 118 ఉన్నాయి. వాటికి 11 నెలలుగా వేతన బకాయిలు అంటే ఒక్కొక్క మసీదుకు రూ.1.65 లక్షల చొప్పున రూ.1,94,70,00 అంటే.. సుమారు రూ.1.95 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. ఒక్కొక్క ఇమామ్‌కు నెలకు రూ.10 వేల చొప్పున రూ.1.10 లక్షలు, ఒక్కో మౌజన్‌కు నెలకు రూ.5 వేల చొప్పున రూ.55 వేల బకాయిలు ఉన్నాయి. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని ఇమామ్‌లు, మౌజన్లు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ముస్లిం సంఘాలతో పాటు మేధావులు, మానవతావాదులను కలుపుకొని డిమాండ్ల సాధనకు పోరాడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
మసీదుల నిర్వహణకు..
మసీదుల నిర్వహణకు నెలకు రూ.5 వేల చొప్పున అందిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. కానీ అధికారం చేపట్టాక ఆ విషయం మర్చిపోయారు. లెక్కల ప్రకారం.. కనీసం చిన్న మసీదుకు నెలకు రూ.5 వేల చొప్పున జిల్లాలోని 118 వాటికి నెలకు రూ.5.90 లక్షలు చెల్లించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలు కాలానికి మొత్తం రూ.88.50 లక్షలు అవుతోంది. కానీ నేటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అలాగే షాదీ తోఫా పేరుతో రూ.లక్ష ఇస్తామన్న హామీని కూడా తుంగలో తొక్కారు.
వైఎస్సార్ సీపీ హయాంలో..
వైఎస్సార్ సీపీ హయాంలో అన్ని వర్గాలతో పాటు ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేశారు. తాను అధికారంలోకి రాగానే ఇమామ్‌లకు, మౌజన్‌లకు రెట్టింపు గౌరవ వేతనం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా అధికారం చేపట్టగానే ఇమామ్‌లకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచారు. అలాగే ప్రతి నెలా క్రమం తప్పకుండా గౌరవ వేతనాలు చెల్లించారు. వారందరికీ జగనన్న కాలనీల్లో స్థలాలు, ఇళ్లు మంజూరు చేసి ఆదుకున్నారు.
ముస్లింలపై కూటమి చిన్నచూపు
ఇమామ్, మౌజన్లకు
అందని గౌరవ వేతనాలు
11 నెలలుగా చెల్లించని సర్కారు
జిల్లాలో 118 మసీదులు

గౌరవ వేదన