
సుప్రీం ఆదేశాలు కూటమికి చెంపపెట్టు
వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్
రాష్ట్ర అధికార ప్రతినిధి మహ్మద్ ఆరీఫ్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వివాదాస్పద వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలు రాష్ట్రంలోని కూటమి పాలకుల ముస్లిం వ్యతిరేక విధానాలకు చెంపపెట్టు వంటిదని వక్ఫ్ బోర్డు జిల్లా మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మహ్మద్ ఆరీఫ్ అన్నారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వక్ఫ్ చట్టం సవరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలు ముస్లిం సమాజానికి ఊరట కలిగించాయన్నారు. తుది తీర్పులో ముస్లింలకు శాశ్వత న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన ఈ వివాదాస్పద వక్ఫ్ చట్టానికి అనుకూలంగా పార్లమెంటులో తన ఎంపీలతో చంద్రబాబు ఓటు వేయించారన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ముస్లిం ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని మరోసారి నిరూపిస్తూ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడానికి ఆదేశాలు ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ముస్లిం సమాజం రుణపడి ఉంటుందన్నారు. టీడీపీ మద్దతుతో ఈ బిల్లు ఆమోదం పొందిందని, చంద్రబాబు నిర్ణయం వల్లే ముస్లిమేతరులు వక్ఫ్‌బోర్డులో సభ్యులుగా వచ్చారన్నారు.