
విద్యుత్ ఉద్యోగుల ఉద్యమబాట
● నేటి నుంచి నిరసనలు
● జేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణ
రాజమహేంద్రవరం రూరల్: తమ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. రెండు రోజులుగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించిన వారందరూ బుధవారం నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఏపీ విద్యుత్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఆందోళన కార్యక్రమాలపై బొమ్మూరులోని 220 కేవీ సబ్‌స్టేషన్ ఏపీ ట్రాన్స్‌కో ఓఅండ్‌ఎం సర్కిల్ ఎస్‌ఈకి నోటీసు కూడా అందజేశారు. ప్రధాన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణ ఉంటుందని ఏపీ ట్రాన్స్‌కో ఓఅండ్‌ఎం సర్కిల్ జేఏసీ చైర్మన్ జగతా అచ్యుత రామయ్య, కన్వీనర్ పి.రవికుమార్ వివరించారు.
డిమాండ్లు ఇవే
● నగదు రహిత వైద్యం అందించాలి.
● 1999 ఫిబ్రవరి ఒకటి నుంచి 2004 ఆగస్టు 31 మధ్య చేరిన ఉద్యోగులకు పెన్షన్ సదుపాయం కల్పించాలి.
● దళారీ వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్టు కార్మికులకు నేరుగా జీతాలు చెల్లించాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. దీర్ఘకాలిక సర్వీసు గల వారందరినీ సంస్థలో విలీనం చేయాలి.
● పాత పద్ధతిలో కారుణ్య నియామకాలు చేపట్టాలి.
● జేఎల్‌ఎం గ్రేడ్–2లను జేఎల్‌ఎంలుగా పరిగణించాలి. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను మంజూరు చేయాలి.
● ఇంజినీరింగ్ డిగ్రీ కలిగిన సబ్ ఇంజినీర్లకు ఏఈలుగా పదోన్నతిలో అవకాశం కల్పించాలి.
● అర్హులైన ఓఅండ్‌ఎం ఉద్యోగులను జూనియర్ సహాయకులు, సబ్ ఇంజినీర్ ఖాళీలలో నియమించాలి.
● ప్రమాదాలు జరిగినప్పుడు సాంకేతికపరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలి.
నల్లబ్యాడ్జీలతో నిరసన
రాష్ట్ర పవర్ జేఏసీ పిలుపు మేరకు కాతేరు మల్లయ్యపేట 132 కేవీ సబ్ స్టేషన్ వద్ద ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జేఏసీ నాయకులు డేవిడ్ రాజు, అర్జున్, గంగరాజు, రెడ్డి, నాగులు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు సమస్యల పరిష్కారమయ్యే వరకూ ఆందోళనను విరమించేది లేదన్నారు.
నిరసనల షెడ్యూల్
ఈ నెల 17, 18 తేదీల్లో అన్ని సర్కిల్ ఆఫీసులు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద భోజన విరామ సమయాల్లో ధర్నా
19, 20 తేదీల్లో అన్ని సర్కిల్ ఆఫీసులు, జనరేటింగ్ స్టేషన్ల ముందు
రిలే నిరాహార దీక్షలు
22న జిల్లా కేంద్రంలో శాంతియుత
ర్యాలీ నిర్వహించి, కలెక్టర్‌కు
వినతి పత్రం సమర్పించడం