
శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్యాయత్నం
అన్నవరం: ఐదేళ్ల క్రితం ప్రభుత్వ స్థలాన్ని ప్రవేట్ స్థలంగా నమ్మించి తన బంధువులకు విక్రయించి మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలని పోలీసులను, పెద్దలను ఆశ్రయించినా న్యాయం జరగలేదని మనస్థాపానికి గురైన అన్నవరం దేవస్థానం శానిటరీ ఇన్‌స్పెక్టర్ టి.వేంకటేశ్వరరావు శుక్రవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే సకాలంలో అతడిని తునిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో అక్కడ చికిత్స పొందుతున్నారు. ఎటువంటి ప్రాణపాయం లేదని వైద్యులు చెప్పినట్టు ఆయన కుటుంబ సభ్యులు శనివారం తెలిపారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ వేంకటేశ్వరరావు రాసిన లేఖలో వివరాల ప్రకారం.. ఆయన 2021లో మధ్యవర్తిగా ఉండి తన తోడల్లుడు తెడ్లాపు రవికుమార్, మరదలు వేంకట సత్యదీప్తి కోసం బెండపూడి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 114–16ఎ, 114–17ఏ లో రియల్ ఎస్టేట్ వెంచర్‌లోని 33 నెంబర్ ప్లాట్‌ను రూ.25 లక్షలకు స్థానిక వ్రతపురోహితుడు నాగాభట్ల సీతారామం వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఐదేళ్ల అనంతరం ఈ ఏడాది ఆగష్టు 14న ఆ స్థలాన్ని ఎల్‌ఆర్‌ఎస్ నిమిత్తం కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఆఫీసులో సంప్రదించగా అది ప్రభుత్వ భూమి అని తేలిందని తెలిపారు. దాంతో ఆ భూమి విక్రయించిన నాగాభట్ల సీతారామంను డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగ్గా తాను రియల్ ఎస్టేట్ వెంచర్‌లో దానిని కొన్నానని ఆ వెంచర్ వేసిన వారినే అడగాలని అంటున్నాడని అందులో పేర్కొన్నారు. దీనిపై తొండంగి పోలీసులను ఆశ్రయించినా, పెద్దల వద్ద పంచాయితీ పెట్టినా న్యాయం జరగలేదని పేర్కొన్నారు. దాంతో తనకు గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కాగా, తుని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేంకటేశ్వరరావును దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు శనివారం పరామర్శించారు. వేంకటేశ్వరరావుకు స్థలం అమ్మిన నాగాభట్ల సీతారామంను ఈ వ్యవహారంపై ప్రశ్నించగా తాను ఇల్లు కట్టుకుందామని ఆ ప్లాట్ కొనుక్కున్నానని కాని తన తండ్రి అనారోగ్యం కారణంగా 2021లో విక్రయించానని తెలిపారు. అది తన పూర్వార్జితం కాదని అది ప్రభుత్వ భూమి అన్న విషయం తనకు తెలియదని తెలిపారు. ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన వారినే అడగాలని ఆయనకు చెప్పానని తెలిపారు.