
ఉమ్మడి జిల్లాలో 42 బెంచ్‌ల్లో లోక్ అదాలత్
● పరిష్కరించిన కేసులు 4,453
● బాధితులకు రూ.16.35 కోట్ల నష్టపరిహారం
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ప్రమాదవశాత్తూ మృతి చెందిన వారి కేసుల్లో రాజీ పడ్డ వారు నష్టపరిహారానికి ఎక్కువ కాలం వేచి ఉండనవసరం లేదని, ఇన్సూరెన్స్ కంపెనీ లబ్ధిదారుడు తన బ్యాంక్ అకౌంట్ తెలిపితే నెల రోజుల్లోనే లబ్ధిదారుని ఖాతాలోనే జమ చేస్తారని ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.మాధురి తెలిపారు. ఉమ్మడి జిల్లాలైన తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏఎస్‌ఆర్ జిల్లాల్లో శనివారం 42 బెంచ్‌లలో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. దీనిని జిల్లా కోర్టులో ఇన్‌చార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.మాధురి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్‌లో ఇరువర్గాల సమస్య రాజీతో కూడిన పరిష్కారం అవుతుందన్నారు. లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో తూర్పు గోదావరి జిల్లా ముందంజలో ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలో 4453 కేసులను పరిష్కరించారు. బాధితులకు రూ.16.35 కోట్ల నష్టపరిహారాన్ని అందేలా చేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎస్.ఉమా సునంద, ఎల్.వెంకటేశ్వరరావు, ఎస్‌కే.జానీబాషా, బి.పద్మ, కె.ప్రకాష్‌బాబు, ఎన్.శ్రీలక్ష్మి, టి.రాఘవేంద్ర, జి.శ్రీనివాస్‌రెడ్డి, పి.బాబు, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ కార్యదర్శి పి.రమేష్ పాల్గొన్నారు.