
జ్ఞాన సముపార్జనపై దృష్టి సారించాలి
తుని: విద్యార్థులు జ్ఞాన సముపార్జనపై దృష్టి సారించాలని భారతీయ వరి పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్‌ఎం సుందరం సూచించారు. స్థానిక స్పేసెస్ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన యువ ప్రేరణ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్ధుల ఆలోచనల్లో సృజనాత్మకత లేకపోతే యాంత్రికంగా మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థులు పరీక్షల కోసం కాకుండా జీవిత లక్ష్యాల సాధనకు సమర్థ ప్రణాళికలు రచించాలన్నారు. సవాళ్లను అధిగమించి అవకాశాలను అందిపుచ్చుకునేలా సంసిద్ధులై ఉండాలని చెప్పారు. మరో అతిథి, శాస్త్రవేత్త డాక్టర్ ఎస్‌వీ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు సాధించే మార్కులు వారి మేధస్సుకు కొలమానం కాదన్నారు. లక్ష్యసాధన వైపు అడుగులేయాలంటే కఠోరశ్రమ, పట్టుదల ఎంతో అవసరమన్నారు. శ్రీప్రకాష్ విద్యాసంస్థల అధినేత నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్‌ప్రకాష్ అతిథులను జ్ఞాపికలతో సత్కరించారు.