
భ్రాంతిభద్రతలు భేష్!
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లాలో శాంతిభద్రతలు కట్టుతప్పుతున్నాయా? రౌడీ షీటర్ల ఆగడాలు శ్రుతిమించుతున్నాయా? రోడ్లపైనే మద్యం తాగి దాడులు, దోపిడీలకు పాల్పడుతున్నారా? నడిరోడ్లపై కొట్లాటలు సాగుతున్నాయా? గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేస్తోందా? యథేచ్ఛగా పేకాట శిబిరాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అశ్లీల నృత్యాలు, రేవ్ పార్టీలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు కొందరు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యం అవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఏడాదిగా జిల్లాలో చోటు చేసుకుంటున్న ఘటనలే తార్కాణం. వాటి వివరాలు ఇలా..
● దివాన్‌చెరువు పెట్రోల్ బంక్ సమీపంలో లారీ ఆపి డివైడర్‌పై పడుకొని ఉన్న లారీ డ్రైవర్‌పై తెల్లవారు జామున నాలుగు గంటలకు ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. అతని వద్ద ఉన్న రూ.20,000 నగదు, సెల్‌ఫోన్ తీసుకుని వెళ్లిపోయారు. అతనిపై తీవ్రంగా దాడి చేయడంతో అక్కడే కుప్పుకూలిపోయాడు. 112 ద్వారా అందిన సమాచారం మేరకు పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.
● ఇటీవల రాజమహేంద్రవరం తూర్పు రైల్వేస్టేషన్ రోడ్డులో క్రైమ్ పోలీసులం అని చెప్పి సీతంపేటకు చెందిన 67 ఏళ్ల వృద్ధుడి వద్ద 9 గ్రాముల బంగారపు ఉంగరాలు లాక్కుని వెళ్లిపోయారు.
● ఇటీవల కొవ్వూరు వెళ్లాలని వేచి చూస్తున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ యువకుడు ఏమార్చాడు. కొవ్వూరు తీసుకెళ్తానని వాహనం ఎక్కించుకుని కొంతదూరం వెళ్లాక అతని వద్ద ఉన్న డబ్బు లాక్కొని పరాయయ్యాడు.
● నల్లజర్ల మండలంలోని ఘంటావారిగూడెం గ్రామశివారులో గుణ్ణం సురేష్‌కు సంబంధించిన రిసార్ట్(కొబ్బరితోట)లో అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యక్రమాలకు తెర తీశారు. బర్త్‌డే పార్టీ సందర్భంగా అసాంఘిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. యూ ఆకారంలో టేబుల్స్ పెట్టుకుని మద్యం సేవిస్తూ.. ఉండగా మధ్యలో యువతులు అశ్లీల నృత్యాలు చేస్తున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో రాత్రి 11 గంటల సమయంలో దాడి చేశారు. ఇతర జిల్లాలకు చెందిన నలుగురు డ్యాన్సర్లు, 24 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు మద్యం బాటిళ్లు, రూ.10 వేల నగదు, 6 కార్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో ఉంగుటూరుకు చెందిన నాయకుడు తన పుట్టినరోజు వేడుకకు ఇదే తరహాలో పార్టీ ఏర్పాటు చేయగా పార్టీ మధ్యలో పోలీసులు దాడి చేశారు. అయినా పరిస్థితి మారలేదంటే పోలీసుల పహరా ఎలా ఉందో అర్థం అవుతోంది.
రాజమహేంద్రవరంలో బరి తెగింపు
ప్రశాంతంగా ఉండే చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో రౌడీ మూకలు బరి తెగిస్తున్నాయి. బ్లేడ్ బ్యాచ్, మందు బ్యాచ్, గంజాయి బ్యాచ్‌లుగా ప్రతి రోజూ రాత్రిళ్లు హల్‌చల్ చేస్తున్నారు. ఆకతాయిల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. రాత్రివేళ్లల్లో నడిరోడ్లపైనే గొడవలకు దిగుతున్నారు. ప్రజలకే కాదు నైట్ బీట్ నిర్వహించే పోలీసులకు కూడా రక్షణ కరవైంది. ఎందుకు గొడవలు చేస్తున్నారని ప్రశ్నించిన పోలీసులు పైనే దాడులకు తెగబడుతున్నారు. బరి తెగిస్తున్న రౌడీషీటర్ల చేష్టలకు పోలీసులు నివ్వెర పోతున్నారు. చివరకు పోలీసులు ఏమీ చేయలేక రౌడీషీటర్ల చేతిలో తన్నులు తింటున్న ఘటనలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
పోలీసులపైనే దాడులు
రాజమహేంద్రవరంలో ఇటీవల ఓ రౌడీ బ్యాచ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పైనే దాడికి తెగబడింది. రాత్రి గస్తీ తిరుగుతున్న కానిస్టేబుల్ నాగబాబు, హోమ్ గార్డ్ కాళీలు.. రోడ్డుపై హల్‌చల్ చేస్తున్న ముగ్గురు యువకులను ఈ టైం లో తిరగకూడదని చెప్పారు. ఇంటికి వెళ్లండని హెచ్చరించారు. దీంతో.. మద్యం సేవించిన ఆ యువకులు మీరేంటిరా చెప్పేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా.. మాతోనే పెట్టుకుంటారా..? అంటూ పోలీసులపై చేయి చేసుకున్నారు. పోలీసు లాఠీని లాక్కుని, ఎంత వారిస్తున్నా పట్టించుకోకుండా విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ని చితకబాదారు. ఈ ఘటన సర్వత్రా సంచలనం రేకెత్తించింది. ఈ దాడి ఘటన వీడియో వైరల్ కావడంతో పోలీసు శాఖ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాలతో వెంటనే దాడి చేసిన యువకుల కోసం ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేసి 24 గంటలు తిరక్కుండానే అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. ఏది ఏమైనా పోలీసులపైనే తిరగబడ్డారంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం అవుతోంది.
జిల్లాలో కట్టు తప్పుతున్న
శాంతిభద్రతలు
పోలీసులపైనే దాడులకు
తెగబడుతున్న రౌడీషీటర్లు
రాత్రిళ్లు తప్పతాగి గొడవలు, దోపిడీలు
శ్రుతిమించుతున్న ఆగడాలు
చారిత్రక రాజమహేంద్రిలో
అసాంఘిక ఘటనలు
అశ్లీల నృత్యాలు, యథేచ్ఛగా
మద్యం, పేకాట
కఠినంగా వ్యవహరిస్తున్నామంటున్న పోలీసులు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం. జిల్లాలో పోలీసులు సమర్థంగా విధులు నిర్వర్తిస్తున్నారు. గంజాయి, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా డ్రోన్ ద్వారా నిఘా పెట్టాం. రెండు రోజుల్లో బహిరంగంగా మద్యం తాగే వారిని గుర్తించి 300 కేసులు నమోదు చేశాం. రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం చేస్తున్నాం. నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు మద్యం షాపులు నడుపుతున్న యజమానులు, రాత్రి సమయాల్లో తాగి రోడ్లపై తిరిగే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నాం. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి న్యాయం చేస్తున్నాం. అసాంఘిక ఘటనలు చోటు చేసుకోకుండా గణపతి నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించాం.
– డి.నరసింహ కిషోర్, ఎస్పీ, తూర్పుగోదావరి
తెలియకుండా మరికొన్ని...
రాజమహేంద్రవరం నగరంలో తెలిసినది ఈ ఘటన అయితే పోలీసుల దృష్టికి రాకుండా మరెన్నో జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. గంజాయి, మద్యానికి బానిసలైన ఆకతాయి యువకులకు కొందరు రౌడీషీటర్లు ఆశ్రయం ఇస్తున్నారు. వారిని అక్రమ వ్యవహారాలు, వివాదాలు, సెటిల్‌మెంట్లకు వాడుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కొందరు యువకులు అర్ధరాత్రి దాటిన తర్వాత కొన్ని జంక్షన్లు, నగర శివారు ప్రాంతాలను తమ అడ్డాలుగా చేసుకుని మద్యం బాటిల్స్‌తో రోడ్లపైనే హల్‌చల్ చేస్తున్నారు. కొందరైతే దారిన పోయే వారితో గొడవలకు దిగుతున్నారు. వారి నుంచి విలువైన వస్తువులు దోచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. వీరిపై ఫిర్యాదు చేస్తే.. ఎక్కడ తమపై దాడి చేస్తారో అన్న భయంతో అనేకమంది పోలీస్ స్టేషన్ గడప తొక్కడం లేదన్న విమర్శలున్నాయి.
కౌన్సెలింగ్ ఏదీ?
గతంలో ప్రతి నెలా రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చేవారు. పోలీసుల దెబ్బకు అణిగిమణిగి ఉండేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కౌన్సెలింగ్ నిర్వహించిన దాఖలాలు లేవు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో రౌడీ షీటర్లు పేట్రేగిపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. రాజకీయ పైరవీలకు తలొగ్గి కేసులు కట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భ్రాంతిభద్రతలు భేష్!

భ్రాంతిభద్రతలు భేష్!