
పత్రికా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరిస్తోంది..
ప్రజాస్వామ్యంలో ఉన్న పత్రికా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరిస్తోంది. సాక్షిలో నిజాలను నిర్భయంగా రాస్తే కేసులు పెడతారా? ఒక నాయకుడు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌ను పత్రికలో పబ్లిష్ చేస్తే కేసులు పెట్టడం విడ్డూరంగా ఉంది. ప్రచురించిన వార్తలో అభ్యంతరాలు ఉంటే ఖండన లేదా వివరణ ఇవ్వాలి కాని ఎడిటర్, ఎడిషన్ ఇన్‌చార్జిలు, పత్రిక ప్రతినిధులపై కేసులు పెట్టడం దారుణం. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం హక్కు లేదా?
– తానేటి వనిత, రాష్ట్ర మాజీ హోం మంత్రి
సాక్షి ఎడిటర్‌పై కేసు సరి కాదు
రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడిన మాటలను ప్రచురించినందుకు ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడం సరికాదు. పత్రికలో వచ్చిన వార్తపై అభ్యంతరాలు ఉంటే ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చు. లేదా ఖండన ఇవ్వొచ్చు. కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గం.
– చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, తూర్పుగోదావరి