
జిల్లా సేకరణ కమిటీ సమావేశంలో కలెక్టర్ ప్రశాంతి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అక్టోబర్ రెండో వారం నుంచి ఖరీఫ్ వరి ధాన్యాన్ని సేకరించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 2025– 26 ఖరీఫ్ వరి ధాన్య సేకరణ సన్నద్ధతపై జిల్లా సేకరణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఆమె మాట్లాడుతూ గ్రేడ్ ఏ రకానికి క్వింటాకు రూ.2,389, సాధారణ రకానికి క్వింటాకు రూ.2,369 కనీస మద్దతు ధరగా నిర్ణయించినట్లు చెప్పారు. గత సీజన్‌తో పోలిస్తే కనీస మద్దతు ధర రూ.69 పెరిగిందన్నారు.
వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఖరీఫ్‌లో 5,31,616 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి కానుందని చెప్పారు. ధాన్యం సేకరణకు సిబ్బంది కొరత లేకుండా చూడాలని, అవసరమైతే నియామకం చేపట్టాలని సూచించారు. ఈ నెలాఖరుకల్లా ఈ పంట, ఈ కేవైసీ పూర్తి చేయాలన్నారు. మిల్లులు సిద్ధంగా ఉన్నాయని సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. మిల్లుల టాగింగ్, తనిఖీపై దృష్టి సారించాలన్నారు. ధాన్యం తరలించే వాహనాలన్నిటికీ జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలన్నారు. గోతాముల కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.
గత సీజన్లో మిల్లులకు 3,54,903 మెట్రిక్ టన్నుల ధాన్యం చేరగా, 2,28,806 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే వారి నుంచి వచ్చిందని, ఇంకా 10,781 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉందని దీనిని త్వరితగతిన రికవరీ చేయాలని ఆదేశించారు. ఆర్డీవోలు ఆర్.కృష్ణనాయక్, రాణి సుస్మిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్.మాధవరావు, జిల్లా సహకార శాఖ అధికారి ఎం.వెంకటరమణ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వి. పార్వతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.