
మొక్కలతో పర్యావరణ పరిరక్షణ
రాజమహేంద్రవరం రూరల్: మొక్కలు నాటడం ద్వారా స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. కాతేరులోని తిరుమల విద్యాసంస్థల ఆధ్వర్యంలో మంగళవారం గామన్ బ్రిడ్జి నుంచి వెంకట నగరం మధ్య గల ఆర్‌అండ్‌బీ రోడ్డు డివైడర్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ భూమాతను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, భూమిపై పచ్చదనం పెరగాలంటే మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఆ విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సరోజనీదేవి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం చిన్నప్పటి నుంచే అలవాటుగా ఉండాలనే ఉద్దేశంతో చిన్న పిల్లలతో మొక్కలు నాటించామన్నారు. అనంతరం తిరుమలరావు, సరోజనీదేవి, వారి కుమార్తె రష్మి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్లాస్టిక్ నిర్మూలన ఉద్యమకారిణి, ఆంధ్ర రాష్ట్ర స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు గ్రహీత జి.వనజ, తిరుమల విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్ బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.