
క్రీడలతో ఒత్తిడి నుంచి ఉపశమనం
కాకినాడ లీగల్: న్యాయవాదులు వృత్తిలో ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారని, దాని నుంచి ఉపశమనం పొందేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జి జి.ఆనంది అన్నారు. కోర్టు ఆవరణలో రూ.3 లక్షలతో నిర్మించిన క్రికెట్ ప్రాక్టీస్ నెట్‌ను బుధవారం ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. వాటి ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందన్నారు. క్రికెట్ నెట్ ద్వారా న్యాయవాదులు తమ క్రికెట్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ఆరో అదనపు జిల్లా జడ్జి పి.గోవర్ధన్ బౌలింగ్ చేయగా, జడ్జి ఆనంది బ్యాటింగ్ చేశారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏలూరి సుబ్రహ్మణ్యం, చెక్కపల్లి వీరభద్రరావు, ఉపాధ్యక్షుడు పెన్మెత్స రామచంద్రరాజు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ జోకా విజయ్ కుమార్, తలాటం హరీష్ తదితరులు పాల్గొన్నారు.