
నాణ్యమైన సరకులే సరఫరా చేయాలి
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి నాణ్యమైన బియ్యం, పప్పులు, ఇతర దినుసులను సరఫరా చేయాలని టెండర్ దారులకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జీఏబీ నందాజీ సూచించారు. ఇటీవల దేవస్థానానికి బియ్యం, పప్పులు, ఇతర దినుసులు సరఫరా చేయడానికి టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయగా సుమారు పది మంది టెండర్లు దాఖలు చేశారు. ఆ టెండర్లు తెరవడానికి ముందు దేవస్థానంలో ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నందాజీ మాట్లాడుతూ సరఫరాదారులు పంపించిన సరకుల్లో నాణ్యమైనవని తమ పరీక్షల్లో తేలితేనే, వాటిని దేవస్థానంలో ఉపయోగించేందుకు అనుమతిస్తామన్నారు. లేకపోతే వెనక్కి పంపించేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పి.కేశవ్ దుర్గాప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.