
‘నిర్కా’కు సీఎస్‌ఆర్ ప్రాజెక్టు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరంలోని ఐకార్ – నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్ (నిర్కా)కు న్యూఢిల్లీకి చెందిన ఎం/ఎస్ ఎలైట్‌కాన్ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి మొదటి సీఎస్‌ఆర్ ప్రాజెక్టు లభించింది. ఈ విషయాన్ని నిర్కా డైరెక్టర్ డాక్టర్ మా గంటి శేషుమాధవ్ బుధవారం ప్రకటనలో తెలి పారు. ఈ ప్రాజెక్టును తాను, క్రాప్ మేనేజ్‌మెంట్ డివిజన్ హెడ్ డాక్టర్ కొరడ రాజశేఖరరావు, బహుశాఖ శాస్త్రవేత్తల బృందంతో కలిసి ముందుకు తీసుకువెళతామన్నారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి వద్ద ఉన్న ఐకార్–నిర్కా ప్రాంతీయ కేంద్రంలోని పది ఎకరాల పొలంలో సాంకేతిక ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. రెండేళ్ల వ్యవధి కలిగిన ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 500 మంది రైతులకు శిక్షణ ఇస్తామన్నారు. సెన్సార్లు, డ్రోన్లు రెండు మార్గాల సమాచార వ్యవస్థల ద్వారా పంట, పురుగుల వాతావరణాన్ని పర్యవేక్షించి రైతులకు తక్షణ సలహాలు అందించడం లక్ష్యమన్నారు. దీని ఫలితంగా నీటి వినియోగం 40–50 శాతం తగ్గడం, ఎనర్జీ వ్యయం 30–40 శాతం తగ్గడం, ఎరువుల సామర్థ్యం పెరగడం, ఉత్పాదకత మెరుగుపడడం, డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగాహన పెరుగుతుందన్నారు.