
గురువులపై బరువు
● అసెస్‌మెంట్ బుక్‌లెట్ల విధానానికి కూటమి శ్రీకారం
● ఉపాధ్యాయులకు పెరిగిన పని ఒత్తిడి
● బోధనకు సమయం లేక అవస్థలు
సాక్షి, రాజమహేంద్రవరం: దేశ అభ్యున్నతికి, సమాజ ప్రగతికి విద్య ఎంతో అవసరం. దాన్ని పిల్లలకు అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. ఈ నేపథ్యంలో పిల్లలకు విద్యాబోధన చేయడానికి వారికి తగినంత సమయం కేటాయించాలి. కానీ కూటమి ప్రభుత్వం గురువులపై బరువు మోపుతోంది. బోధనేతర పనులను అప్పగిస్తూ, పాఠాలు చెప్పడానికి సమయం లేకుండా చేస్తోంది. నూతన సంస్కరణల పేరుతో ఎఫ్‌ఏ, ఎస్‌ఏ పరీక్షలకు అసెస్‌మెంట్ బుక్‌లెట్ విధానం తీసుకువచ్చింది. దానిలో వివరాల నమోదు చాలా ఎక్కువ సమయం పడుతుండడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉపాధ్యాయులకు భారం
మూల్యాంకనంలో తీసుకొచ్చిన అసెస్‌మెంట్ బుక్‌లెట్ విధానం ఉపాధ్యాయులకు భారంగా మారుతోంది. బోధనతో పాటు అసెస్‌మెంట్ చేపట్టాలంటే కష్టసాధ్యమన్న వాదన వినిపిస్తోంది. సాధారణంగా ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షలు ఏడాది పొడవునా జరుగుతూనే ఉంటాయి. పరీక్షల జవాబు పత్రాలు, ఓఎమ్మార్ షీట్లను అసెస్‌మెంట్ బుక్‌లెట్‌లో నమోదు చేయాల్సి ఉంది. విద్యార్థులు రాసిన పరీక్షలకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల మార్కులను దానిలో నింపాలి. ఒక్కో పరీక్షకు సంబంధించి దాదాపు వంద జవాబు పత్రాలను ఉపాధ్యాయులు దిద్దాల్సి ఉంది.
అస్తవ్యస్తం
సంక్షేమ పథకాల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం.. పాలనలో తన మార్కును చూపించుకునేందుకు తహతహలాడుతోంది. అందులో భాగంగా సజావుగా నడుస్తున్న వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తోంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో రేషనలైజేషన్‌తో ఉద్యోగుల్లో ఆందోళన నింపింది. ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా పేరు మార్చి బకాయిలు చెల్లించకుండా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. తాజాగా విద్యాశాఖపై వికృత బుద్ధి ప్రదర్శిస్తోంది. హేతుబద్ధీకరణ పేరుతో స్కూల్ కాంప్లెక్స్‌ల స్థానంలో క్లస్టర్ వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు పాఠశాలల విలీన అంశాన్ని తెరపైకి తెచ్చింది. ప్రతి పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి, చుట్టుపక్కల పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను అందులో విలీనం చేసే ప్రక్రియకు నాంది పలికింది. తాజాగా అసెస్‌మెంట్ బుక్‌లెట్ల విధానాన్ని తెరపైకి తీసుకొచ్చి గురువులపై బరువు మోపే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
జిల్లాలో 985 పాఠశాలలు
జిల్లా వ్యాప్తంగా 985 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ప్రైమరీ 711, అప్పర్ ప్రైమరీ 72, హైస్కూళ్లు 183, హైస్కూల్ ప్లస్ 15 ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలు 587, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒకటి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో 1.76 లక్షలు, ప్రైవేటు పాఠశాలల్లో 1.52 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులకు ఏడాదిలో నాలుగు ఫార్మెటివ్‌లు, రెండు సమ్మెటివ్ పరీక్షలు నిర్వహిస్తారు. గతంలో ప్రశ్నపత్రం, ఓఎమ్మార్ షీట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందించేది. జవాబు పత్రాలను విద్యార్థులు తీసుకురావాల్సి ఉంది. జవాబు పత్రాలను ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి మార్కులను ఓఎమ్మార్ షీట్లలో నమోదు చేసేవారు. అనంతరం వాటిని జిల్లా అధికారులు స్కాన్ చేసి భద్రపరిచేవారు. మూల్యాంకనం ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి చేసేవారు. తర్వాత పాఠ్యాంశాల బోధనకు ఎక్కువ సమయం ఉండేది.
నూతన సంస్కరణలు
కూటమి ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పరీక్షల విధానంలో నూతన సంస్కరణలకు నాంది పలికింది. అసెస్మెంట్ బుక్‌లెట్‌ను తీసుకురావడంతో పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలు, ఓఎమ్మార్ షీట్లను ఇందులో పొందుపర్చాలి. పరీక్ష సమయంలో విద్యార్థులకు బుక్‌లెట్‌ను ఇచ్చి, దానిలో జవాబులు రాయించాలి. ఇందులో వచ్చిన మార్కులను ఓఎమ్మార్ షీట్‌లో నమోదు చేయాలి. అంతేగాక వాటిని స్కానింగ్ సైతం ఉపాధ్యాయులే చేయించాలి. ఈ బుక్‌లెట్‌లో విద్యార్థి ఆధార్, యూడైస్, పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్లనూ అయ్యవార్లే నమోదు చేయాలి. ఏడాదిలో సబ్జెక్టుకు 6, 7వ తరగతులకు 36, అలాగే 8, 9, 10 తరగతుల విద్యార్థులకు 42 ఓఎమ్మార్ షీట్లుంటాయి. విద్యా సంవత్సరం ముగిసేంత వరకు జవాబు పత్రాలు, వారికొచ్చిన మార్కులను బుక్‌లెట్‌లోనే నమోదు చేయాలి. వీటిని పాఠశాలల్లోనే భద్రపరచాలి. ఇంటికి తీసుకెళ్లకూడదు. దీంతో ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతోందని, పాఠ్యాంశాల బోధన ఇబ్బందిగా మారుతోందని ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు.
రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
బోధనేతర పనులు
కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం మోపుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన లీప్ యాప్‌లో ఐఎమ్మెమ్మెస్, స్టూడెంట్స్ కిట్స్, మెగా పేటీఎంలను ఉంచారు. దీంతో పాటు పాఠశాలకు ప్రతి నెలా అందిన బియ్యం బస్తాలపై క్యూర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంది. అందులోని నాణ్యతను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఇలా అన్ని పనులూ ఉపాధ్యాయులతోనే చేయిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు.

గురువులపై బరువు

గురువులపై బరువు