జిల్లాలో 10 వేలకు పైగా హెచ్‌ఐవీ కేసులు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 10 వేలకు పైగా హెచ్‌ఐవీ కేసులు

Sep 11 2025 2:36 AM | Updated on Sep 11 2025 2:36 AM

జిల్లాలో 10 వేలకు పైగా హెచ్‌ఐవీ కేసులు

జిల్లాలో 10 వేలకు పైగా హెచ్‌ఐవీ కేసులు

నియంత్రణ బాధ్యత అందరిదీ

మారథాన్‌ 5 కె రెడ్‌ రన్‌లో కలెక్టర్‌ ప్రశాంతి

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో 10 వేలకు పైగా హెచ్‌ఐవీ కేసులు ఉన్నాయని, అవి పెరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. ఎయిడ్స్‌పై అవగాహనకు డిస్ట్రిక్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ స్ట్రేటజీ ఫర్‌ హెచ్‌ఐవీ అండ్‌ ఎయిడ్స్‌ (దిశ) ఆధ్వర్యంలో బుధవారం మారథాన్‌ 5 కె రెడ్‌ రన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా హెచ్‌ఐవీ పరీక్షలకు సంచార సమీకృత సలహా, పరీక్ష కేంద్రాన్ని (మొబైల్‌ ఇంటిగ్రేటెడ్‌ కౌన్సిలింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ సెంటర్‌) ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అవగాహన, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎయిడ్స్‌ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. దీనిపై యువతకు అవగాహన కల్పించడానికి, ఎయిడ్స్‌ బాధితులకు మద్దతుగా నిలవడానికి మారథాన్‌ 5 కె రన్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులపై చిన్న చూపు, వివక్ష తగదన్నారు. జిల్లాలో హెచ్‌ఐవీ కౌన్సెలింగ్‌, పరీక్షలకు ఐదు ఎస్‌ఏ, ఐసీటీసీ కేంద్రాలు, 38 పీహెచ్‌సీ ఎఫ్‌ఐ ఐసీటీసీ కేంద్రాలు, 14 యూపీహెచ్‌సీ కేంద్రాలున్నాయన్నారు.

విజేతలకు బహుమతులు

జిల్లా ఎయిడ్స్‌, కుష్ఠు, క్షయ నివారణ అధికారి డాక్టర్‌ వసుంధర మాట్లాడుతూ హెచ్‌ఐవీపై పురుషులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన వారికి రూ.10 వేలు, రూ.7 వేలు చొప్పున అందించినట్టు తెలిపారు. ఈ విజేతలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే రన్‌లో పాల్గొంటారన్నారు. అక్కడ విజేతలుగా నిలిస్తే జాతీయ స్థాయి రన్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. హెచ్‌ఐవీ సంబంధిత సమాచారానికి జాతీయ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 1097ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వరరావు, జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యురాలు డాక్టర్‌ గన్ని మహాలక్ష్మి, ఆర్ట్స్‌ కళాశాల రెడ్‌ రిబ్బన్‌ కో ఆర్డినేటర్‌ రవితేజ, వీటీ కళాశాల ప్రతినిధి జేజే.విజయ్‌ ప్రకాష్‌, దిశ క్లస్టర్‌ మేనేజర్‌ ఆదిలింగం, జిల్లా సూపర్‌ వైజర్‌ హరినాథ్‌ కుమార్‌, నగర ప్రజలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

డాక్యుమెంట్ల అప్‌లోడ్‌ తప్పనిసరి

రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సర్కులర్లు, ప్రభుత్వ ఉత్తర్వులు తదితర డాక్యుమెంట్లను తప్పనిసరిగా ఈపీటీఎస్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని అధికారులను కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ డాక్యుమెంట్ల అప్‌లోడ్‌ విషయంలో నిర్లక్ష్యం సహించేది లేదన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో ఈపీటీఎస్‌ 67,398 డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ కాగా, గురువారం ఉదయం నాటికి లక్ష రికార్డులు పూర్తి చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement