
వైఎస్ జగన్‌తో గూడూరి భేటీ
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఆ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లిలోని మాజీ సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఆయన వెంట పార్టీ ప్రచార విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు తోట రామకృష్ణ ఉన్నారు.
పూర్తిస్థాయిలో సిబ్బంది
లేకుంటే ఒప్పందం రద్దు
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో భద్రతా సిబ్బంది నియామకంపై ఒప్పంద నిబంధనలు పాటించని ఏజెన్సీకి చెల్లింపుల్లో కోత విధించాలని అధికారులకు కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. ఆసుపత్రి భద్రత, పారిశుధ్యం, ఆహారం సరఫరా నిర్వహిస్తున్న సంస్థల ప్రతినిధులతో బుధవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒప్పందం ప్రకారం ఆసుపత్రిలో 67 మంది భద్రతా సిబ్బంది ఉండాలని, ఇప్పుడు కేవలం 55 మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు తక్కువగా ఉన్న సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా ఏజెన్సీ చెల్లింపులపై కోత విధించాలని ఆదేశించారు. ఉత్సాహంగా పనిచేసే వారినే నియమించాలని, ప్రతి రోజూ హాజరు పరిశీలన (రోల్ కాల్) తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. పూర్తి స్థాయి నియామకాలు చేపట్టకపోతే ప్రస్తుత ఏజెన్సీ ఒప్పందాన్ని రద్దు చేసి వేరే సంస్థకు పనులు అప్పగిస్తామని హెచ్చరించారు.