ఉద్యమంపై ఉక్రోషం! | - | Sakshi
Sakshi News home page

ఉద్యమంపై ఉక్రోషం!

Sep 10 2025 2:15 AM | Updated on Sep 10 2025 2:21 AM

రైతులకు అండగా ఆందోళన చేస్తున్న

వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై పోలీసుల జులుం

యూరియా, ఎరువుల కొరతపై

అధికారులకు విన్నవించేందుకు

నేతల సమాయత్తం

ముందుకు కదలకుండా అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లకుండా నిలువరించిన వైనం

నిరసనగా రోడ్డుపై బైఠాయించి

రెండు గంటలు ధర్నాకు దిగిన

వైఎస్సార్‌ సీపీ నేతలు

కొవ్వూరులో ఆంక్షలను అధిగమించి ఆర్డీఓ

కార్యాలయానికి చేరుకున్న పార్టీ నేతలు

డిమాండ్లపై ఆర్డీఓకు వినతి పత్రం

సాక్షి, రాజమహేంద్రవరం: అన్నదాతలకు అండగా చేపడుతున్న ఉద్యమంపై కూటమి ప్రభుత్వ నేతృత్వంలోని పోలీసులు ఉక్రోషం ప్రదర్శించారు. కర్షకుడి కష్టాలు కూటమి పాలకులు, అధికారుల కళ్లకు కట్టేందుకు సమాయత్తమవుతున్న ఉద్యమకారుల గొంతు నొక్కారు. యూరియా, ఎరువుల కొరత అరికట్టాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయానికి వెళుతున్న వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు, రైతులపై ఆంక్షలు విధించారు. కార్యాలయం వద్దకు వెళ్లేందుకు వీలులేదంటూ ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. నేతల ఇళ్లవద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి మరీ బయటకు రాకుండా నిలువరించారు. కొందరు పోలీసులైతే అత్యుత్సాహం ప్రదర్శించారు. నిరసన కార్యక్రమానికి వెళ్లవద్దంటూ ముందురోజు నేతలకు ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు ఎవరూ రాకుండా నిలువరించారు. కనీసం వినతి పత్రం ఇచ్చేందుకు సైతం అనుమతించలేదంటే రాష్ట్రంలో ఎలాంటి రాజ్యాంగం నడుస్తోందో అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ప్రజాస్వామ్యం బతికుందా? అన్న అనుమానం కలుగుతోందని ప్రజలు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజమహేంద్రవరంలో ఉద్రిక్తం

యూరియా, ఎరువుల కొరతను తక్షణం నివారించాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్‌ సీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. యూరియా, ఎరువుల కొరతపై సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించేందుకు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, రైతులు సమాయాత్తమయ్యారు. రాజమహేంద్రవరం ప్రకాష్‌ నగర్‌లోని జక్కంపూడి రాజా గృహం నుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళుతున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులను, నాయకులను పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదని వారించారు. అక్కడికి వెళ్లనిచ్చేది లేదంటూ పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అక్కడి నుంచి కదలకుండా అష్టదిగ్బంధనం చేశారు. వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఎంత సర్దిచెప్పినా వినకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైఎస్సార్‌ సీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా వినకుండా పోలీసులు నేతలు, రైతులను అక్కడే నిలువరించారు. దీంతో ఆగ్రహించిన వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, అనపర్తి ఇన్‌చార్జి సత్తిసూర్యనారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్‌) చందన నాగేశ్వర్‌, గుబ్బల తులసీకుమార్‌, నక్కా నగేష్‌, రైతులు అక్కడే బైఠాయించారు. ఎర్రటి ఎండలో సుమారు రెండు గంటల పాటు రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కూటమి వ్యవహరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. తక్షణం రాష్ట్రంలో యూరియా కొరతను నివారించాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో క్రిష్టియన్‌ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రెవ.విజయసారథి, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి అంగాడి సత్యప్రియ పాల్గొన్నారు.

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం దిగ్బంధం

వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వినతి పత్రం ఇచ్చేందుకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా అక్కడికి చేరుకున్నారు. ఎవరూ రాకుండాకార్యాలయం నలువైపులా అష్ట దిగ్బంధం చేశారు. నాలుగు వైపులా రహదారులను బంధించారు.

కొవ్వూరులో సక్సెస్‌

కొవ్వూరు డివిజన్‌లో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీఅన్నదాత పోరుశ్రీ కార్యక్రమం విజయవంతమైంది. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, తక్కువ మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశాలిచ్చినా, వాటిని లెక్క చేయకుండా వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. తొలుత నాయకులు, కార్యకర్తలు కొవ్వూరు మెరకవీధి వాటర్‌ ట్యాంక్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు తానేటి వనిత, తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాస్‌ నాయుడుల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. ర్యాలీ బస్టాండ్‌ సెంటర్‌, విజయవిహార్‌ సెంటర్‌, ఎల్‌ఐసీ ఆఫీస్‌ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. అందరికీ అనుమతి లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. కేవలం 50 మంది ఆర్డీఓ కార్యాలయంలోకి అనుమతిస్తామని పోలీసులు అడ్డుకున్నారు. అందరినీ పంపించాలని ఎంత వాదించినా ససేమిరా అనడంతో వైఎస్సార్‌ సీపీ నేతలు మిన్నకుండిపోయారు. అనంతరం రైతుల సమ స్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో ఏఓకు సమర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కంఠమని రమేష్‌, మాజీ ఏమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, ఎంపీపీ లు, మండలం అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉద్యమంపై ఉక్రోషం!1
1/3

ఉద్యమంపై ఉక్రోషం!

ఉద్యమంపై ఉక్రోషం!2
2/3

ఉద్యమంపై ఉక్రోషం!

ఉద్యమంపై ఉక్రోషం!3
3/3

ఉద్యమంపై ఉక్రోషం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement