
బాబూ.. లోడెత్తాల !
బాబూ.. లోడెత్తాల !
● యూరియా కోసం రైతుల అగచాట్లు
● లోడు ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి
● అవసరమైన మేరకు అందుబాటులో
ఉంచడంలో కూటమి ప్రభుత్వం విఫలం
● వచ్చిన యూరియాను తన్నుకుపోతున్న కూటమి నేతలు
● తమ అనుయాయులకు అందజేస్తున్న వైనం
● పీఏసీఎస్‌ల వద్ద అన్నదాతల పడిగాపులు
● వచ్చినా.. బస్తా యూరియాకు తప్పని కుస్తీ
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం కర్షకులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. పంటల సాగుకు కీలకమైన దశలో యూరియా, ఎరువులు అందించడంతో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సకాలంలో ఎరువులు సరఫరా చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. అరకొరగా అందుబాటులో ఉంచుతూ ఆందోళనకు గురి చేస్తోంది. వెరసి రైతు సేవా కేంద్రాలు, సొసైటీ కార్యాలయాల్లో ఎరువుల నిల్వలు నిండుకున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు అల్లాడుతున్నారు. అమావాస్యకో.. పున్నానికో వస్తున్న వాటిని సైతం కూటమి నేతలు తన్నుకుపోతున్నారు. ముందుగానే పసిగట్టి గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇవేమీ తెలియని రైతులకు మాత్రం సొసైటీ కార్యాలయాల వద్ద నిరీక్షణ తప్పడం లేదు. గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి తలెత్తిందని రైతులు వాపోతున్నారు. పీఏసీఎస్ కార్యాలయాల వద్ద పెద్ద క్యూలు దర్శనమిస్తున్నాయి. రైతులు అంత ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం ఏ మాత్రం తనకు పట్టదన్నట్లు వ్యవహరిస్తోంది.
అవసరం కొండంత..
రైతులకు అవసరమైన మేరకు ఎరువులు, యూరియా సరఫరా కావడం లేదు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో అత్యధికంగా వరి 76,941 హెక్టార్లలో సాగు చేశారు. 70 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు వేశారు. ప్రస్తుతం పంటలు కీలక దశకు చేరుకున్నాయి. మరో రెండు నెలల వ్యవధిలో ఎరువులు, యూరియా అవసరం ఉంది. కానీ డిమాండ్ తగ్గట్టు అందుబాటులో లేకపోవడంతో రైతుల్లో కలవరం నెలకొంది. ఈ ప్రభావం పంటల దిగుబడిపై పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో 61,692 మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ నేటికి 16,659 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఎరువుల కొరత ఎలా ఉందో అర్థం అవుతోంది. డీఏపీ, కాంప్లెక్స్, సూపర్ ఫాస్పేట్ వంటి ఎరువుల వినియోగం పెరిగిపోయింది. సకాలంలో ఎరువులు లేకపోతే పంట దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
యూరియాకు అత్యధిక డిమాండ్
ప్రస్తుతం వివిధ పంటల దశలను బట్టి చూస్తే యూరియా అవసరం అధికంగా ఉంది. అందుకు అనుగుణంగా యూరియా అందుబాటులో లేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్‌లు, ప్రైవేటు ఎరువుల దుకాణాల్లో బస్తా యూరియా కూడా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ సీజన్‌కు 26,465 మెట్రిక్ టన్నుల యూరియా ఆవస్యకత ఉంది. సెప్టెంబర్ నెలకు సంబంధించి 13,195 మెట్రిక్ టన్నుల యూరియా, ఇతర ఎరువుల అవసరం ఉంటే.. కేవలం 1,456 మెట్రిక్ టన్నులు మాత్రమే కూటమి ప్రభుత్వం అందించింది. అందులో యూరియాను పరిగణలోకి తీసుకుంటే సెప్టెంబర్ మాసానికి మాత్రం 5,890 మెట్రిక్ టన్నులు సరఫరా కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 950 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు. మిగిలిన స్టాక్ ఎప్పుడొస్తుందన్న మీమాంస నెలకొంది.
బ్లాక్ మార్కెట్‌కు తరలింపు
జిల్లాకు వారంలో ఒకటి, రెండుసార్లు యూరియా సరఫరా అవుతోంది. యూరియా వస్తుందన్న సమాచారం ముందస్తుగా ఆయా పీఏసీఎస్‌ల పరిధిలోని కొందరు అధికారులు కూటమి నేతలకు సమాచారం అందిస్తున్నారు. ఇదే అదనుగా రంగంలోకి దిగుతున్న కూటమి నేతలు యూరియాను తన్నుకుపోతున్నారు. తమ అనుయాయులకు కట్టబెడుతున్నారు. కొందరు అవసరం కంటే ఎక్కువగా నిల్వ ఉంచుకుంటుంటే.. మరి కొందరేమో బ్లాక్ మార్కెట్‌లో అత్యధిక ధరకు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. వెరసి రైతులకు మద్దతు ధరతో యూరియా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. పీఏసీఎస్‌ల వద్ద గంటల తరబడి క్యూలో నిల్చుని పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంటోంది. టీడీపీ మద్దతు దారులు దర్జాగా ఎరువులు పక్కదారి పట్టిస్తున్నారు.
అధిక ధరలకు విక్రయం
యూరియా కొరతను సాకుగా తీసుకుంటున్న ప్రైవేటు డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సగటున ఒక్కో మండలంలో ఏడాదిలో 4,500 టన్నుల నుంచి 15 వేల టన్నుల వరకు ఎరువులు వినియోగిస్తున్నారు. టన్నుపై రూ.4 వేల వరకు ఎరువుల భారం రైతులపై పడుతోంది. ఈ ప్రభావం చిన్న, సన్నకారు రైతులపై పడుతోంది. యూరియా 45 కేజీల బస్తా ప్రభుత్వ నిర్ణయించిన ధర ప్రకారం రూ.266.70 చేసి విక్రయించాల్సి ఉంది. కానీ ప్రైవేట్ దుకాణాల దారులు డీలర్లు బస్తాను రూ.330 నుంచి రూ.390 చేసి విక్రయిస్తున్నారు. ఆర్‌ఎస్‌కే, పీఏసీఎస్‌ల వద్ద యూరియా అమ్మకాలకు ఆధార్ లింక్ చేయడం, ఎకరాకు అరబస్తా మాత్రమే ఇస్తామనే నిబంధనలతో రైతులకు పూర్తి స్థాయిలో యూరియాను అందుబాటులో ఉంచడం లేదు. ఇలా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.
యూరియా కోసం యుద్ధం
● యూరియా కోసం రైతులు యుద్ధం చేస్తున్నారు. ఎప్పుడు వస్తుందో అధికారులు ప్రకటిస్తున్నారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో రైతులు, అధికారుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి.
● కొవ్వూరు నియోజకవర్గం గజ్జరం, అన్నదేవరపేట, మలకపల్లి, రాగోలపల్లి సొసైటీల వద్ద యూరియా కోసం రైతులు తరచూ తిరగాల్సిన పరిస్థితి వస్తోంది. ఎంత యూరియా వచ్చింది, ఎంతమంది రైతులకు సరఫరా చేస్తున్నారన్న వివరాలు తెలియడం లేదు. రైతుకు 10 ఎకరాలు లేదా ఎన్ని ఎకరాలు ఉన్నా రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని, ఇలా అయితే ఎలా సరిపోతుందని అంటున్నారు. ఆధార్ కార్డుపై యురియా సరఫరా చేయడం సరైన విధానం కాదని, కౌలు కార్డులు, పాస్‌బుక్‌ల అధారంగా యూరియా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
● సీతానగరం మండలంలో నిత్యం యూరియా కోసం యుద్ధాలు తప్పడం లేదు. వస్తున్న సరకు ఏ మవుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. లారీ యూరియా వస్తే.. నిమిషాల వ్యవధిలోనే ఖాళీ అయిపోతోంది. రైతులు మాత్రం క్యూలో అలా నిల్చోవాల్సిన పరిస్థితి దర్శనమిస్తోంది.
● కోరుకొండలో ఇటీవల యూరియా పంపిణీలో వివాదం చోటు చేసుకుంది. లారీ యూరియా వచ్చినా.. అక్కడున్న రైతులకు మాత్రం అందలేదు. వచ్చిన సరకంతా ఏమైందంటూ రైతులు అధికారులను ప్రశ్నించడం, అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడం, రైతులు ఒక్కసారిగా పీఏసీఎస్ కార్యాలయం వైపు దూసుకెళ్లడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.
● గాదరాడ వద్ద అధికారులు తమకు కావాల్సిన ఒక్కో రైతుకు 5 నుంచి 10 బస్తాల యూరియా ఇచ్చేస్తున్నారు. ఆకస్మిక పర్యటనకు వెళ్లిన కలెక్టర్ పి.ప్రశాంతి దృష్టికి సమస్య రావడంతో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో రైతుకు రెండు బస్తాలు ఇవ్వాల్సి ఉండగా.. ఎక్కువగా ఎందుకిచ్చారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చే శారు. ఎక్కువగా ఇచ్చిన బస్తాలను రికవరీ చేయా లంటూ తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు.
● రంగంపేట మండలం వడిశలేరు సొసైటీ వద్ద ఇటీవల ఎరువుల కోసం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున నుంచే రైతు సేవా కేంద్రాలు, సొసైటీల వద్ద బారులు తీరారు. కేవలం ఈ గ్రామాల్లోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఘటనలే దర్శనమిస్తున్నాయి.
జిల్లాలో ఎరువుల వివరాలు ఇలా (మెట్రిక్ టన్నుల్లో)...
ఎరువులు ఖరీఫ్‌లో సెప్టెంబర్ ఇప్పటి వరకు
ఆవశ్యకత నెల అవసరం సరఫరా
యూరియా 26,465 5,890 950
డీఏపీ 6,420 736 0
ఎంఓపీ 4,806 1,795 267
ఎన్‌పీకేఎస్ 18,607 3,564 203
ఎస్‌ఎస్‌పీ 5,394 1,210 36
‘అన్నదాత పోరు’ను జయప్రదం చేయండి
యూరియా, ఎరువుల కొరత నివారించాలని, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని డిమాండ్ చేస్తూ రైతులకు బాసటగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ‘అన్నదాత పోరు’ పేరుతో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కొవ్వూరు, రాజమహేంద్రవరం ఆర్డీఓ కార్యాలయాల వద్ద అన్ని నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్‌లు, పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై గళమెత్తుతాం. రాజమహేంద్రవరం రూరల్, సిటీ, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల శ్రేణులు రాజమండ్రి ఆర్డీఓ కార్యాలయం వద్ద, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల శ్రేణులు కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతాం. కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అభిమానులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలి.
– చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు

బాబూ.. లోడెత్తాల !

బాబూ.. లోడెత్తాల !

బాబూ.. లోడెత్తాల !