
గౌరవ వేతనం ఆపడం సరి కాదు
● ఇమామ్‌లు, మౌజన్‌లకు
11 నెలలుగా వేతనాలు లేవు
● జేసీకి వినతి పత్రం అందచేసిన
మైనార్టీ నాయకులు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌర వవేతనం ఆపడం సరికాదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు అన్నారు. సోమవారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మైనార్టీ నాయకులతో వేణు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లో జేసీ మేఘా స్వరూప్‌కి వినతి పత్రం అందచేశారు. మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మీర్జా మౌలా అలీ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం వల్లనే ఇమామ్‌లు, మౌజన్‌లు జీవనోపాధి పొందుతూ మసీదుల నిర్వహిస్తున్నారన్నారు. 11 నెలలుగా జీతాలు ఇవ్వకుంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో ఒకసారి ఆలోచించాలని ప్రభుత్వానికి విన్నవించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏ నెలా బకాయి లేకుండా గౌరవ వేతనాలు విడుదల చేశారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గౌరవ వేతనాలను పెంచి మసీదులకు అందించాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మొహమ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముస్లిం సామాజిక వర్గం అన్ని రంగాలలోనూ వివక్షకు గురై తీవ్ర వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 118 మసీదుల నిర్వహణ ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనంపై ఆధారపడి జరుగుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా మసీదులకు బకాయి ఉన్న రూ.1,94,70,000 గౌరవ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి ఆదాయ మార్గాలు లేని మసీదులకు అంతకు ముందున్న చంద్రబాబు ప్రభుత్వం ఎనిమిది వేలు అందిస్తుంటే గత ప్రభుత్వంలో మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసిన మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్‌మోహన్‌రెడ్డి దానిని రెట్టింపు చేసి ప్రతి నెల రూ.15 వేలులు అందజేసేవారన్నారు. అధికారంలోకి వచ్చేందుకు మైనార్టీలకు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా గతం నుంచి అందిస్తున్న సంక్షేమాన్ని సైతం ఇలా వివక్షా పూరితంగా అడ్డుకోవడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. తక్షణమే గౌరవ వేతనాలు విడుదల చేయని పక్షంలో అన్ని మసీదు కమిటీలతో పాటు ముస్లిం సంఘాలను, మానవతావాదులను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు. మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు ఆరిపుల్ల ఖాన్, జిల్లా మైనార్టీ సెల్ మాజీ ప్రధాన కార్యదర్శి షేక్ ఇబ్రహీం, షేక్ చానా, షేక్ మస్తాన్, మదీనా భాష, ప్రింటు భాయ్, పలు మసీదుల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.