
ప్రతిభకు ప్రోత్సాహం
● ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తుల
ఆహ్వానం
● 9 నుంచి ఇంటర్ వరకు
ఏటా రూ.12వేల స్కాలర్‌షిప్
● ఎంపికై న వారికి నాలుగేళ్ల పాటు స్కాలర్‌షిప్
● ఈ నెల 30 దరఖాస్తుకు తుది గడువు
● డిసెంబరు 7 ఎన్‌ఎంఎంఎస్ అర్హత పరీక్ష
రాయవరం: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ సర్టిఫికేట్ (ఎన్‌ఎంఎంఎస్) పథకాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ఎన్‌ఎంఎంఎస్ అర్హత పరీక్షలో ఎంపికై న వారికి 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు ఏటా రూ.12 వేలు వంతున నాలుగేళ్లకు మొత్తం రూ.48 వేలు అందజేస్తారు. అయితే ఇంటర్ విద్యను ప్రభుత్వ పాఠశాలలోనే చదవాల్సి ఉంటుంది. వసతిగృహాల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు స్కాలర్‌షిప్ ఇవ్వరు. డే స్కాలర్‌గా ఉన్న విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ అందజేస్తారు.
పేద విద్యార్థులకు భరోసా..
కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏటా పేద విద్యార్థుల్లో ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని 2008–09లో ప్రవేశపెట్టారు. ఇది పేద విద్యార్థుల విద్యకు భరోసా కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సంచాలకుల ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు.
ఎంపికై న విద్యార్థులకు ఏటా రూ.12 వేల వంతున నాలుగేళ్ల పాటు విద్యార్థికి స్కాలర్‌షిప్ నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. పదో తరగతి ఉత్తీర్ణత అనంతరం ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వారికి మాత్రమే స్కాలర్‌షిప్ కొనసాగిస్తారు. ట్రిపుల్ ఐటీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదివిన వారికి కూడా స్కాలర్‌షిప్ కొనసాగింపు ఉండదు. ఏటా జిల్లా నుంచి సుమారు వందలాది మంది ఎంపికవుతున్నారు.
డిసెంబరు 7న అర్హత పరీక్ష
పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబరు 7న అర్హత పరీక్ష నిర్వహిస్తారు. అదేరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాత పరీక్ష ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఎన్‌ఎంఎంఎస్ ప్రవేశ పరీక్షకు అర్హులు. ఆబ్జెక్టివ్ విధానంలో 180 మార్కులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. 90 మార్కులకు రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్ ఉండగా, మరో 90 మార్కులకు 7, 8 తరగతులకు చెందిన గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలపై ప్రశ్నలుంటాయి. పరీక్ష రాసేందుకు మూడు గంటల సమయం కేటాయిస్తారు. జిల్లా ప్రాతిపదికగా స్కాలర్‌షిప్‌కు విద్యార్థులను ఎంపిక చేస్తారు.
అర్హతలివీ
ప్రస్తుతం ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తులకు అర్హులు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50 లక్షల లోపు ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు ఈ నెల 30 చివరి తేదీ కాగా, పరీక్ష రుసుం చెల్లించేందుకు అక్టోబరు ఒకటో తేదీ తుది గడువు. ప్రధానోపాధ్యాయులు ప్రింటెడ్ నామినల్ రోల్స్, ధ్రువపత్రాలను సంబంధిత జిల్లా విద్యాశాకాధికారి కార్యాలయంలో సమర్పించడానికి ఈ నెల 30 చివరి తేదీ.
అధిక సంఖ్యలో దరఖాస్తు చేయించాలి
ప్రతి పాఠశాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ప్రధానోపాధ్యాయులు చూడాలి. విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపాలి.
– డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈఓ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
పేద విద్యార్థులకు వరం
నిరుపేద విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్ ఒక వరం. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఎన్‌ఎంఎంఎస్ అర్హత పరీక్షను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఎన్‌ఎంఎంస్‌కు అధిక సంఖ్యలో విద్యార్థులు అర్హత సాధించేలా సంబంధిత పాఠశాల విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
– జి.నాగమణి, ఆర్‌జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ
జిల్లాలో పరిస్థితి ఇదీ
గత విద్యా సంవత్సరంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గత విద్యా సంవత్సరంలో 2,815 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి గతేడాది డిసెంబరు ఎనిమిదో తేదీన 13 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్ అర్హత పరీక్షకు 2,688 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 142 మంది ఎన్‌ఎంఎంఎస్‌కు అర్హత సాధించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో సుమారు 12,131 మంది 8వ తరగతి విద్యాభ్యాసం చేస్తున్నారు.
ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తులు
ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్‌ఎంఎంఎస్ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభించారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో పాఠశాల డైస్ కోడ్ ద్వారా లాగిన్ అవ్వాలి. దరఖాస్తులో విద్యార్థి పూర్తి వివరాలను ఉపాధ్యాయుడి సమక్షంలో పొందుపరచాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50 పరీక్ష ఫీజు చెల్లించాలి.

ప్రతిభకు ప్రోత్సాహం

ప్రతిభకు ప్రోత్సాహం