
రత్నగిరిపై భూగర్భ విద్యుత్ లైన్లు
● రూ.28 లక్షల వ్యయంతో ఏర్పాటు
● పాలకవర్గ సమావేశంలో నిర్ణయం
● కార్తికమాసం ఏర్పాట్లపై చర్చ
అన్నవరం: రత్నగిరిపై స్వామివారి నిత్య కల్యాణ మండపం, వ్రత మండపాలకు స్వామి వారి ఆలయానికి రత్నగిరి పవర్‌హౌస్ నుంచి అండర్ గ్రౌండ్ కేబుళ్ల ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.28 లక్షలతో రూపొందించిన అంచనాలకు దేవస్థానం పాలకవర్గం ఆమోదం తెలిపింది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరిపి తీర్మానాలు చేశారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తీర్మానాలివీ..
● సుమారు రూ.40 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూపొందించిన అంచనాలపై చర్చించి ఆమోదం తెలిపారు.
● గత నెలలో నిర్వహించిన కొబ్బరి ముక్కలు, బుకింగ్ కౌంటర్ వద్ద మూడో నెంబర్ షాపు, ఇతర షాపుల వేలంపాటలలో హెచ్చు మొత్తం వేలం పాటలకు ఆమోదం తెలిపారు.
● సత్యగిరిపై రహదారుల నిర్మాణానికి పిలిచిన రూ.32 లక్షలు టెండర్‌కు ఆమోదం.
కార్తికమాసం ఏర్పాట్లపై చర్చ
అక్టోబర్ 22వ తేదీ నుంచి నవంబర్ 18వ తేదీ వరకు కొనసాగనున్న కార్తికమాసంలో వచ్చే భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు చర్చించి పలు నిర్ణయాలు తీస్కున్నారు. ప్రధానంగా రూ.7.70 లక్షల వ్యయంతో తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం, రూ.ఐదు లక్షల వ్యయంతో షామియానాలు, రూ.పది లక్షలతో తాత్కాలిక క్యూ లైన్లు నిర్మాణం, రూ.ఐదు లక్షలతో తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.