
అధ్యాపకుల సేవలు కనపడలేదా
● జేఎన్‌టీయూకేకు దక్కని
ఉత్తమ పురస్కారం
● వర్సిటీ చరిత్రలో మచ్చగా మిగలనున్న వైనం
● రాయలసీమ వర్సిటీల నుంచి
ముగ్గురికి అవకాశం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్రంలో సాంకేతిక వర్సిటీలలో కీలకంగా ఉన్న జేఎన్‌టీయూ కాకినాడ నుంచి ఈ ఏడాది రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుల పురస్కారానికి అర్హత గలవారు ఒక్కరూ లేరన్నట్టు కనిపిస్తుంది. ప్రొఫెసర్ల హోదా కలిగి అధ్యాపక వృత్తిలో 20 నుంచి 30 ఏళ్ల సర్వీస్ ఉన్న వారిలో ఒక్కరికీ అవకాశం దక్కలేదు. ఏటా కనీసం ఇద్దరు ప్రొఫెసర్లకు అవకాశం దక్కేది. కానీ ఈ ఏడాది నలుగురు పేర్లు ప్రతిపాదించినా కనీసం వారిలో ఒక్కరి పేరు కూడా రాకపోవడం వర్సిటీ ప్రతిష్టకు మచ్చగా మిగిలిపోతుంది. వర్సిటీకు రిజిస్ట్రార్లుగా పనిచేసిన ఇద్దరు, మరో సీనియర్ ప్రొఫెసర్‌తో పాటు, డైరెక్టర్‌గా పనిచేసిన ఒక ప్రొఫెసర్ పేరు ప్రతిపాదించగా వీరిలో కనీసం ఒక్క పేరునూ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఏపీ ఎంసెట్, ప్రభుత్వ ఉద్యోగాల వంటి కీలక పరీక్షల నిర్వహణ, రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్సిటీకే అప్పగిస్తున్న తరుణంలో ఏ ఒక్క ప్రొఫెసర్ ఉత్తమ అధ్యాపకుడిగా రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించలేదా అన్న సందేహం వర్సిటీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వర్సిటీలను బలోపేతం చేస్తామంటూ జాతీయ విద్యాసంస్థల్లో పనిచేసే వారికి, ఉపకులపతులుగా నియమించిన ప్రభుత్వానికి ఇంత మంది సీనియర్ ప్రొఫెసర్లలో ఒక్కరూ కనిపించకపోవడం విస్మయానికి గురిచేసింది. రాయలసీమ ప్రాంతంలో ఉన్న అనంతపురం వర్సిటీ నుంచి ముగ్గురు ప్రొఫెసర్లకు, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి నుంచి ముగ్గురిని ఎంపిక చేశారు. దీన్ని బట్టి జేఎన్‌టీయూకేను ప్రభుత్వం అవార్డుల ఎంపికలో అసలు ప్యానల్ లిస్టులోకి తీసుకోలేదా అన్న సందేహం వర్సిటీ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.