
శిశువులకు అమృతమే..
జిల్లాలో పరిస్థితి
అంగన్‌వాడీ కేంద్రాలు 1,726
బాలింతలు 5,846
గర్భిణులు 7,725
ఆరు నెలల లోపు చిన్నారులు 901
6 నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 7,017
3–6 ఏళ్ల వయస్సున్న చిన్నారులు 8,041
● తల్లిపాలలో పోషకాలు
● బిడ్డలకు తాగిస్తే ఎన్నో ప్రయోజనాలు
● తల్లులకూ ఉపయోగమే
● వచ్చే నెల ఒకటి నుంచి
తల్లిపాల వారోత్సవాలు
రాయవరం: శిశువుకు అత్యంత బలం, రోగనిరోధక శక్తిని అందించేవి తల్లిపాలే. అవి దాదాపు అమృతంతో సమానం. అందుకే పిల్లలు పుట్టిన వెంటనే తల్లి పాలు పట్టించాలని వైద్యులు చెబుతారు. తల్లి పాలు తాగిన పిల్లలకు రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఎదుగుదల చాలా చక్కగా ఉంటుంది. అయితే పిల్లలకు తల్లి పాలు ఎప్పటి వరకూ పట్టించాలి, ముర్రుపాలు అంటే ఏమిటి అనే విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. దీని కోసం ఆగస్టు ఒకటి నుంచి ఏడో తేదీ వరకూ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గర్బిణులు, బాలింతలకు తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పిస్తారు.
తల్లిపాల గొప్పదనం
తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటివి. బిడ్డ పుట్టిన వెంటనే అర్ధగంటలోపు ముర్రుపాలు పట్టాలి. ఎందుకంటే ఆ పాలలో బిడ్డను వ్యాధుల నుంచి రక్షించే ఖనిజాలు, మాంసకృతులు, విటమిన్–ఏ సమృద్ధిగా ఉంటాయి. ముర్రుపాలు బిడ్డకు వ్యాధి నిరోధక టీకాగా పనిచేస్తుంది. తల్లిపాలు శిశువులకు ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమమైన పౌష్టికాహారం అని చెప్పవచ్చు. వీటి వల్ల పిల్లలకు మలవిసర్జన సులభంగా అవుతుంది. తల్లితో చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. బిడ్డ కోరుకున్న ప్రతి సారి ఎంతసేపు తాగితే అంతసేపు తల్లి పాలు పట్టించాలి.
ఆరోగ్యకర సమాజం
సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో తల్లుల వైఖరిలో కూడా మార్పు వస్తోంది. బిడ్డకు పాలిస్తే తమ అందం పాడవుతుందని ఆలోచించే తల్లులు కూడా నేటి సమాజంలో దర్శనమిస్తున్నారు. తల్లి పాలు పట్టడం వలన బిడ్డలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో వరల్డ్ అలైన్స్ ఫర్ బెస్ట్ ఫీడింగ్ ఏక్షన్(వాబా) అనే సంస్థ పర్యవేక్షణలో డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ వంటి అంతర్జాతీయ, బీపీఏఐ వంటి జాతీయ సంస్థల అనుబంధంగా ప్రపంచ వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. తల్లిపాలను ముఖ్యంగా బిడ్డ పుట్టిన గంట లోపే ముర్రుపాలు ఎందుకు పట్టించాలనే అంశంపై ఏటా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ఐసీడీఎస్, వైద్య ఆరోగ్యశాఖలు సంయుక్తంగా తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పిస్తున్నాయి.
వైద్యారోగ్యశాఖ రక్షణ అవసరం
బాలింతలకు వైద్యఆరోగ్యశాఖ రక్షణ అవసరం. వారికి అవసరమైన మందులు అందించాలి. ముఖ్యంగా రక్తహీనత రాకుండా చర్యలు తీసుకోవాలి. అవసరమైన సమయంలో గర్భిణుల రక్తశాతాన్ని పరిశీలించాలి. ప్రసవం తర్వాత కాల్షియం, ఐరన్ మాత్రలను ఆరు నెలల పాటు అందించాలి.
అధిక పోషకాలు
చిన్నారులను దృష్టిలో ఉంచుకుని తల్లి పాలు మాత్రమే పట్టించాలి. తల్లి పాలలోనే పోషకాలు ఉంటాయి. ఆకలితో ఉన్న బిడ్డకు డబ్బా పాలు ఇవ్వడం వల్ల శక్తిని కోల్పోతారు. బిడ్డకు ఆరు నెలల వరకు తల్లి పాలు మాత్రమే అందించాలి. డబ్బా పాల ద్వారా పౌష్టికాహారం అందదు.
– డాక్టర్ రమ్య, పీహెచ్‌సీ వైద్యాధికారి, రాయవరం
వ్యాధులు దూరం
దేవుడు సృష్టించిన తల్లి పాలు ఒక టీకా కంటే గొప్పవి. తల్లి పాలు పట్టించడం వల్ల బిడ్డకు వైరల్ ఇన్పెక్షన్లు రాకుండా ఉంటాయి. తల్లి పాలలో ఎన్నో పోషకాలు, ప్రొటీన్లు ఉంటాయి. బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకు, శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదం చేస్తాయి.
– డాక్టర్ పి.ప్రశాంతి, గైనకాలజిస్ట్,
మండపేట సీహెచ్‌సీ
తల్లికీ ప్రయోజనాలు
బిడ్డకు తల్లి పాలివ్వడం వల్ల ఆరు నెలల్లోపు గర్భం దాల్చే అవకాశం ఉండదు. ఇది సహజ కుటుంబ నియంత్రణ పద్ధతిగా ఉపయోగపడుతుంది. పాలిచ్చే తల్లులకు రొమ్ము, గర్భసంచి, అండాశయం క్యాన్సర్లు వచ్చే అవకాశం తక్కువని కొన్ని రకాల అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ప్రసవ సమయంలో స్థిరత్వం కోల్పోయిన గర్భసంచి పూర్వస్థితికి వచ్చి రక్తస్రావం తగ్గుతుంది. తల్లిపాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అవి పుష్కలంగా రావాలంటే గర్భిణిగా ఉన్నప్పటి నుంచే పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. పాలు, చేపలు, గుడ్లు, తాజా కూరగాయలు, పండ్లు తగిన మోతాదులో తినాలి.

శిశువులకు అమృతమే..

శిశువులకు అమృతమే..