
వేతన సవరణకు సానుకూలం
సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్ర పేపర్‌మిల్లులో పనిచేసే శాశ్వత ఉద్యోగులకు వేతన సవరణపై మిల్లు యాజమాన్యం సానుకూలంగా స్పందించడం కార్మికుల విజయమని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేపర్ మిల్లు యాజమాన్య వైఖరి, కార్మికుల సమస్యల పరిష్కారానికి తాను చేపట్టిన ఆందోళన వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమైనప్పటికీ.. పూర్తిగా కార్మికులకు న్యాయం జరగలేదన్నారు. శాశ్వత ఉద్యోగులకు మంచి చేస్తూనే కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల డిమాండ్ల సాధనలో పోరాటం కొనసాగుతుందన్నారు. కార్మికుల పక్షాన పోరాడేందుకు జక్కంపూడి కుటుంబం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. వాస్తవానికి గతంలో జరిగిన వేతన ఒప్పందాల కంటే ఇది గొప్పగా లేకపోయినా, పరిశ్రమ మేలు కోరుకునే వారిగా కార్మికులే కొంతమేర రాజీపడి యాజమాన్యంతో జరిగిన వేతన సవరణ చర్చలలో తమ అంగీకారాన్ని తెలిపారన్నారు. కేవలం తాము పని చేస్తున్న పరిశ్రమ బాగుండాలనే ఏకై క లక్ష్యంతో యాజమాన్యం మొండి వైఖరిని భరించి సామరస్యంగానే సమస్యను పరిష్కరించుకోవాలని వేచి చూసి తమ విజ్ఞత చాటుకున్నారని అభినందించారు. వేతన సవరణ విషయంలో సహకరించిన కార్మిక నేతలకు, అధికారులకు, భాగస్వాములైన వారికి రాజా కృతజ్ఞతలు తెలిపారు.
ఇది పేపర్ మిల్లు కార్మికుల విజయం
వైఎస్సార్ సీపీ యువజన విభాగం
రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా