
నేటి నుంచి డిపార్ట్‌మెంటల్ పరీక్షలు
డీఆర్‌ఓ సీతారామ మూర్తి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మే 2025 డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ఆదివారం నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు 6 రోజుల పాటు నిర్వహించనున్నట్టు డీఆర్‌ఓ సీతారామమూర్తి తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఈ మేరకు వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. స్థానిక రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్‌లో ఈ పరీక్షలకు సుమారు 3,771 మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరుగుతాయన్నారు. కన్వెన్షనల్ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఆర్‌ఓ సూచించారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందు నుంచి కేంద్రంలోకి అనుమతించాలని, కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేయాలని అర్బన్ తహసీల్దార్‌ను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా, మెడికల్ క్యాంప్ తదితర చర్యలు చేపట్టాలని, పోలీసు భద్రత పటిష్టంగా పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎం.బాబర్, సెక్షన్ ఆఫీసర్ సీహెచ్ యోగేశ్వరరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీబీటీ హెల్ప్‌లైన్ ఏర్పాటు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కొంతమూరులోని ఎయిడెడ్ స్కూలుకు సంబంధించి ఆదివారం జరగనున్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కు హెల్ప్‌లైన్ కేటాయించినట్లు డీఈఓ కె.వాసుదేవరావు శనివారం తెలిపారు. అభ్యర్థులు సమాచారం కోసం హెల్ప్‌లైన్ 83091 77952 నంబర్‌లో సంప్రదించి ఉదయం 8.00 గంటలోపు సమాచారం తెలుసుకుని పరీక్షా కేంద్రానికి హాజరు కావాలన్నారు.
నేడు విద్యుత్ బిల్లులు
చెల్లించవచ్చు
రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలలో విద్యుత్ బిల్లుల వసూలు కౌంటర్లు ఆదివారం సెలవు దినమైనప్పటికీ పనిచేస్తాయని ఈపీడీసీఎల్ ఎస్‌ఈ కె.తిలక్‌కుమార్ శనివారం తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బిల్లులు చెల్లించాలన్నారు. విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలతో పాటు, ఏపీ ఈపీడీసీఎల్ సెక్షన్ ఆఫీస్ కలెక్షన్ కౌంటర్లు, ఏటీపీ సెంటర్ లలో కూడా బిల్లులు చెల్లించవచ్చునని తెలిపారు.

నేటి నుంచి డిపార్ట్‌మెంటల్ పరీక్షలు