
కక్ష పూరితంగానే మిథున్ రెడ్డి అరెస్టు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కక్షపూరితంగానే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు జరిగిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఆయనకు సౌకర్యాలు కల్పించాలంటూ వేసిన పిటిషన్‌పై ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయడాన్ని బట్టి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నట్టు అర్ధం అవుతోందన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అయితే 40 ఏళ్లుగా చంద్రబాబుకి వైరం ఉండొచ్చని, అది అడ్డం పెట్టుకుని ఆయన కొడుకుని ఇలా ఇబ్బంది పెట్టి ఆనందం పొందడం ఎంతవరకు సబబన్నారు. చివరకు మిథున్ రెడ్డిని భార్య, పిల్లలు కలవడానికి వస్తే కూడా ఏదో రకంగా ఆపే ప్రయత్నం చేస్తూ వచ్చారన్నారు. అసలు ప్రభుత్వ మద్యం పాలసీలో నష్టం ఎక్కడ వచ్చిందని, ఎక్కడా అవకతవకలు జరగలేదన్నారు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే సరికి రూ.18 వేల కోట్ల మేర మద్యం ద్వారా ఆదాయం ఉండేదని, అదే జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.25 వేల కోట్లకు పెరిగిందన్నారు. మరి రూ 3,200 కోట్లు అవినీతి ఎలా నిరూపిస్తారని ప్రశ్నించారు. 2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వంలో డిస్టిలరీలకు ప్రివిలేజ్ ఫీజు తగ్గించడం వలన ప్రభుత్వ ఖజానాకు రూ.3 వేల కోట్ల నష్టం వచ్చిందన్నారు. అది కదా స్కామ్, క్విడ్ ప్రోకో అంటే అన్నారు. ఇవన్నీ ప్రజలు అంతా గమనిస్తున్నారని భరత్ అన్నారు.
మాజీ ఎంపీ భరత్ రామ్