
సంక్షామ గృహాలు!
సాక్షి, రాజమహేంద్రవరం/నెట్‌వర్క్: అపరిశుభ్రతతో కూడిన పరిసరాలు, చాలీచాలని గదులు.. దోమలతో సహజీవనం.. నేలపై భోజనాలు.. వెరసి సంక్షేమ, రెసిడెన్షియల్ వసతి గృహాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పేద విద్యార్థుల సంక్షేమం, వసతితో కూడిన విద్య అందించేందుకు నెలకొల్పిన గృహాల నిర్వహణ లోపం, అపరిశుభ్ర వాతావరణం కంపరం కలిగిస్తున్నాయి. నాణ్యమైన ఆహారం లేకపోవడం మరో సమస్య. సీసీ కెమేరాలు, ప్రహరీలకు విద్యుత్ ఫెన్సింగ్ లేకపోవడంతో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సీసీ కెమెరాలు ఉన్నా సరిగా పనిచేయని పరిస్థితి. వసతిగృహాల్లో వసతులపై ఇటీవల హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తరచూ ఆందోళన కలిగించే భయంకర ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన చెందింది. ఇలాంటి ఘటనలపై స్పందించకపోతే భావితరాలపై ఆ ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని అభిప్రాయపడింది. విద్యార్థులు భద్రంగా, సురక్షితంగా విద్య, వసతి పొందేలా చూడాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేసింది. జిల్లాలోని వసతిగృహాల్లో ‘సాక్షి’ చేపట్టిన ప్రత్యేక పరిశీలనలో అనేక సమస్యలు తేటతెల్లమయ్యాయి.
జిల్లాలో ఇలా..
జిల్లా వ్యాప్తంగా 36 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు ఉండగా.. సుమారు 2,600 మందికి పైగా విద్యార్థులు వసతి పొందుతున్నారు. బీసీ హాస్టళ్లు 24 ఉండగా 1,657 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఒక గురుకుల పాఠశాల ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకుల, కేజీబీవీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో అధ్వాన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి.
అన్నిచోట్లా ఇబ్బందులే..
● రాజమహేంద్రవరం నగరంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో ముగ్గురు వార్డెన్లు మూడు విభాగాలుగా పనిచేస్తున్నారు. వీరిలో 310 మంది విద్యార్థులున్నారు. వారిని ముగ్గురు వార్డెన్లకు సమానంగా విభజించారు.
● ఎస్సీ బాలుర హాస్టల్‌లో 90 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ తాగేందుకు రక్షిత నీరు లేదు. మున్సిపల్ నీటినే తాగుతున్నారు. ఆర్‌ఓ ప్లాంట్ నిరుపయోగంగా ఉంది.
● ఎస్సీ బాలుర కళాశాల హాస్టల్‌లో వార్డెన్ లేరు. సమీప ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్ ఇన్‌చార్జ్జిగా వ్యవహరిస్తున్నారు.
● ఎస్టీ బాలుర హాస్టల్‌లో వంట గది, చుట్టూ ప్రహరీ లేవు. ఆ ఆవరణలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ హాస్టళ్లకు స్కావెంజర్లు లేకపోవడంతో వార్డెన్లు సొంత డబ్బులతో ఏర్పాటు చేసి పనులు కానిస్తున్నారు.
● కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో 3 నుంచి పదో తరగతి వరకు 29 మంది విద్యార్థులు ఉన్నారు. రూ.12 లక్షలతో చేపట్టిన హాస్టల్ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇంకా ఫ్లోరింగ్, శ్లాబ్ లీకేజీ పనులు చేయాలి. కిటికీలకు మెష్‌లు లేవు. విద్యార్థులు దోమల బెడదతో బాధపడుతున్నారు. చుట్టుపక్కల వారు చెత్త వేయడంతో అపరిశుభ్రంగా ఉంది.
● రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో మూడు హాస్టళ్లు ఉన్నాయి. ధవళేశ్వరంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్, కడియంలో బీసీ బాలుర వసతి గృహం, ఎస్సీ బాలికల వసతి గృహాలు ఉన్నాయి. ధవళేశ్వరం ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో గతంలో సాక్షిలో ప్రచురితమైన కథనాలకు ఫ్యాన్లు, కిటికీలకు, తలుపుల బాగుచేయించి దోమల మెష్‌లు వేశారు. మరుగుదొడ్లు బాగుచేయించారు. భవనానికి పెయింటింగ్ వేయాల్సి ఉంది.
● కడియం బీసీ బాలుర వసతి గృహంలో 13 మంది, ఎస్సీ బాలికల వసతి గృహంలో 25 మంది ఉంటున్నారు. వీరికి పాఠశాల దూరంగా ఉండడంతో తల్లిదండ్రులు ఇక్కడ చేర్చేంచేందుకు ఆసక్తి చూపడం లేదు. రెండు వసతి గృహాలకు రెండేసి మరుగుదొడ్ల అవసరం ఉన్నప్పటికీ విద్యార్థులు తక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. సబ్ మెర్సిబుల్ మోటారు సరిగా పని చేయక గోదావరి రక్షిత నీటిని వినియోగిస్తున్నారు. లైట్లు, ఫ్యాన్లు, వంట సామగ్రి, మిక్సీ, గ్రైండర్ ఇటీవలే ఇచ్చారు. రెండు భవనాలకు పెయింటింగ్స్ వేయాల్సి ఉంది.
● అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలంలో అనపర్తి శివారు లక్ష్మీ నరసాపురంలో గురుకుల రెసిడెన్షియల్ హాస్టల్ జూనియర్ కాలేజీ ఉంది. ఇందులో సుమారు 483 మంది చదువుతున్నారు. హాస్టల్‌లో డైనింగ్ హాలు, బయట పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. తినేసి వదిలేసిన ఆహార పదార్థాలు, చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశం అపరిశుభ్రంగా ఉన్నాయి. డైనింగ్ హాల్ ద్వారం వద్ద టైల్స్ శిథిలమయ్యాయి. ఈ హాస్టల్లో ఒకటి నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు చదువుతున్నారు.
హైకోర్టు మార్గదర్శకాలు ఇలా..
వసతి గృహం భవనం చుట్టూ సోలార్ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్‌తో ప్రహారీ నిర్మించాలి. గేటు తప్పనిసరిగా ఉండాలి.
విద్యార్థుల రాకపోకలు ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి.
హాస్టల్ ప్రవేశ మార్గం, కామర్ ఏరియాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
మురగుదొడ్లు శుభ్రంగా ఉండాలి. నీటి సదుపాయం కల్పించాలి.
హాస్టళ్ల సిబ్బందికి ప్రవర్తనా నియమావళిని నిర్దేశించాలి. విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలి.
జాతీయ శిశు సంరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా హాస్టళ్లు ఉండాలి. ఇలా అనేక మార్గదర్శకాలు రూపొందించింది. జిల్లా వ్యాప్తంగా ఒక్క వసతి గృహంలోనూ ఈ మార్గదర్శకాలు పూర్తి స్థాయిలో అమలవుతున్న దాఖలాలు లేవు.
వసతి గృహాల్లో సమస్యల తాండవం
అపరిశుభ్రత, తాగునీటికి ఇబ్బందులు
నేలపైనే భోజనాలు
నిరుపయోగంగా సీసీ కెమెరాలు
హైకోర్టు ఆదేశాలు పట్టని ప్రభుత్వం

సంక్షామ గృహాలు!

సంక్షామ గృహాలు!

సంక్షామ గృహాలు!

సంక్షామ గృహాలు!

సంక్షామ గృహాలు!

సంక్షామ గృహాలు!

సంక్షామ గృహాలు!