అతివృష్టి.. వరికి నష్టి | - | Sakshi
Sakshi News home page

అతివృష్టి.. వరికి నష్టి

Jul 26 2025 9:10 AM | Updated on Jul 26 2025 9:18 AM

ఆక్రమణలు తొలగించాలి

కొవ్వాడ కాలువ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైంది. దీనికితోడు క్లోజర్‌ పనులు సక్రమంగా చేపట్టలేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. కాలువల్లో గుర్రపుడెక్క తొలగించకపోవడం, పూడికతీత పనులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. దీంతో కాలువ పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు ముంపునకు గురువుతున్నాయి. ఫలితంగా ఆయా గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి.

– తలారి వెంకట్రావు, వైఎస్సార్‌ సీపీ

కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి

పంట పొలాలు కాపాడండి

దారవరం స్లూయిజ్‌ నుంచి నీటి ప్రవాహం ముందుకు సాగకపోవడంతో పేమల కాలువ, దారవరం మడుగు పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాలు నీట మునుగుతున్నాయి. పంట పొలాలు ముంపు బారిన పడకుండా శాశ్వత పరిష్కారం చూపాలి. ఏటా ఇదే సమస్య ఎదురవుతోంది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

– మద్దుకూరి రవిప్రసాద్‌, దారవరం సర్పంచ్‌

సాక్షి, రాజమహేంద్రవరం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన వ్యవసాయాన్ని కకావికలం చేస్తోంది. వర్షం నీరు పంట పొలాలను ముంచెత్తుతోంది. స్వేదం చిందించి చేపట్టిన నాట్లను నామరూపాల్లేకుండా చేస్తోంది. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటితో కాలువలు పొంగిపొర్లుతుండగా.. పలు ప్రాంతాల్లో వరి పొలాలు నీటి మునుగుతున్నాయి. మరోవైపు కొవ్వాడ, అప్పారావు చానల్‌ నీరు దిగువకు వెళ్లకపోవడంతో ఆ కాలువల పరిధిలో పంట పొలాల్లోకి నీరు చేసి వరినాట్లు నేలకొరుగుతున్నాయి. వెరసి రైతులకు అగచాట్లు తప్పడం లేదు. ఇప్పటికే పంట సాగుకు అప్పులు చేశామని.. పొలాలను నీరు ముంచెత్తుతుండటంతో మరోమారు నాట్లు వేయాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆవేదన చెందుతున్నారు.

జిల్లాలో 2వేల ఎకరాల్లో నీట మునిగిన వరి

తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా వరి సాధారణ సాగు విస్తీర్ణం 76,941 హెక్టార్లు కాగా.. ఈ నెల 21వ తేదీ నాటికి 55,021 హెక్టార్లలో నాట్లు పడ్డాయి. మిగిలిన విస్తీర్ణంలో నాట్ల వేయడానికి వర్షం కాస్త తెరపిస్తే అనువుగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 1,236 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సుమారు 2 వేల ఎకరాలకు పైగా నీట మునిగినట్లు సమాచారం. మరోవైపు ఈ నెల 28వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ముంపు ప్రభావం కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలో ఎక్కువగా ఉంది.

ఎకరానికి రూ.15 వేల చొప్పున నష్టం

రైతులు అప్పులు చేసి మరీ వరి సాగు చేపట్టారు. నారుమళ్ల దశ దాటి నాట్ల వరకు వచ్చింది. ఎకరం పొలానికి నాట్లు వేయాలంటే సుమారు రూ.10 వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. రెండు వేల ఎకరాల్లో నాట్లు మునిగిపోవడంతో రైతులకు ఇప్పటికే సుమారు రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. నాట్లు దెబ్బతిన్న స్థానంలో తిరిగి వేయాలంటే మరో రూ.5 వేలు వెచ్చించాల్సి ఉంది. దీనికిగాను మరో రూ.కోటి వెచ్చించాలి. కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం లేక.. అన్నదాత సుఖీభవ నిధులు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ముంపు పరిణామం ఆర్థిక అవస్థలు తెచ్చిపెడుతోంది.

నామమాత్రపు పూడికతీతతో ముంపు

విజ్జేశ్వరం బ్యారేజీ నుంచి నీరు రిజర్వ్‌ చేసి అప్పారావు చానల్‌ ద్వారా ఏలూరు కెనాల్‌కు పంపుతారు. 5,000 క్యూసెక్కుల నీటి సరఫరా సామర్థ్యం ఉన్న కెనాల్‌ నుంచి 8,000 క్యూసెక్కుల నీటిని పంపడంతో తమ పొలాలు ముంపునకు గురయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏలూరు కెనాల్‌ గట్లు 5వేల క్యూసెక్కుల నీటిని పంపేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. వాటి ద్వారా 8 వేల క్యూసెక్కులు పంపాలంటే గట్లకు మరమ్మతులు చేపట్టాలి. కాలువలో పూడికతీత, గుర్రపు డెక్క తొలగించాలి. క్లోజర్‌ పనులు దక్కించుకున్న ఓ టీడీపీ నేత తూతూ మంత్రంగా పనులు కానిచ్చేసి చేతులు దులుపుకున్నారు. గుర్రపుడెక్క అలాగే ఉండిపోయింది. పూడికతీత పనులు సైతం నామమాత్రంగా చేపట్టడంతో ముంపు సమస్య తలెత్తిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రోడ్డెక్కిన రైతులు

ముంపు సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ ఇటీవల కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం దారవరం, బ్రాహ్మణగూడెం, గరప్పాడు, మార్కొండపాడు, సమిశ్రగూడెం, ఎస్‌.ముప్పవరం గ్రామ రైతులు శెట్టిపేట ఇరిగేషన్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అప్పారావు చానల్‌ను ఆనుకొని ఉన్న భూములు నారుమడి దశ నుంచి ముంపునకు గురవుతున్నాయన్నారు.

ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం

ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీరు తమ పంట పొలాల్లో ఉండిపోవడంతో తాము పంట నష్టపోతున్నామని, వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు అంటున్నారు. దారవరం మడుగు నుంచి నేరుగా నీటి ప్రవాహం తూరలు లేదా, ప్రత్యేక డ్రెయిన్‌ ఏర్పాటు చేసి నిడదవోలు మండలం శెట్టిపేట లాకుల వద్ద పశ్చిమడెల్టా ప్రధాన కాలువలో కలిసేలా ఏర్పాటు చేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభ్యమవుతుందని రైతులు అంటున్నారు. లేకపోతే దారవరం లాకుల వద్ద లిఫ్ట్‌ పద్ధతిలో నీటిని అప్పారావు చానెల్‌కు తరలించాలని కోరుతున్నారు.

పంట పొలాలను ముంచెత్తిన వరద

కొవ్వాడ, అప్పారావు చానల్‌ నుంచి

నీటి విడుదల

తూర్పుగోదావరి జిల్లాలో 2వేలకు

పైగా ఎకరాల్లో నీట మునిగిన వరి

ఎకరానికి రూ.15 వేల వరకు నష్టం

కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం

నియోజకవర్గాల్లో ప్రభావం

లబోదిబోమంటున్న రైతులు..

ఇరిగేషన్‌ కార్యాలయం వద్ద ఆందోళన

ముంపులోనే పంట పొలాలు

కొవ్వాడ, అప్పారావు కాలువల వరద నీరు పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో కలవాల్సి ఉంది. డెల్టా కాలువకు నీరు విడుదల చేస్తుండటంతో ఈ రెండు కాలువల నుంచి వచ్చే నీరు పశ్చిమ డెల్టా కాలువలో కలవడం లేదు. దీంతో వరద నీరు వెనక్కి పోటెత్తి వందలాది ఎకరాలను ముంచెత్తుతోంది. ఈ ప్రభావం కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల రైతులపై పడుతోంది. కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలంలో వందలాది ఎకరాలు నీట మునిగాయి. పంట పొలాలు ముంపులో ఉండటంతో కర్షకులు కన్నీళ్లు పెడుతున్నారు. దారవరం, బ్రాహ్మణగూడెం, మార్కొండపాడు, మల్లవరం, గౌరిపల్లి, చంద్రవరం గ్రామాల పరిధిలో పొలాలకు నీటి ముప్పు తప్పడం లేదు.

నిడదవోలు మండలం శెట్టిపేట, సింగవరం ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాల భూముల్లోకి నీరు చేరింది.

పెరవలి మండలం కానూరు అగ్రహారంలో పంటలు నీట మునిగాయి.

కొవ్వూరు మండలం ఆరికరేవుల, నందమూరు, దొమ్మేరు, పసివేదల, ధర్మవరం తదితర లోతట్టు ప్రాంత భూములు ముంపు బారిన పడ్డాయి. అధికారుల లెక్కల ప్రకారం కొవ్వూరు మండలంలో 113 ఎకరాలు, నిడదవోలు మండలంలో 197 ఎకరాలు, పెరవలిలో 25 ఎకరాలు ముంపు బారిన పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇదిలా ఉంటే.. కానూరు అగ్రహారంలో 150, ఊసులుమర్రు 150 ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు రైతులు వెల్లడిస్తున్నారు.

అతివృష్టి.. వరికి నష్టి1
1/4

అతివృష్టి.. వరికి నష్టి

అతివృష్టి.. వరికి నష్టి2
2/4

అతివృష్టి.. వరికి నష్టి

అతివృష్టి.. వరికి నష్టి3
3/4

అతివృష్టి.. వరికి నష్టి

అతివృష్టి.. వరికి నష్టి4
4/4

అతివృష్టి.. వరికి నష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement